(Source: ECI/ABP News/ABP Majha)
Vehicles Safety Tips: ఎండ దెబ్బకు వాహనాల్లో మంటలు, ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు!
వేసవి వచ్చిందంటే వాహనాల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలను తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వెహికల్స్ అగ్ని ప్రమాదానికి గురి కాకుండా కాపాడుకోవచ్చు.
Vehicles Safety Tips In Summer: ఎండాకాలంలో కార్లు, బైకులలో తరచుగా అకస్మాత్తుగా మంటలు చెలరేగడం గమనిస్తూనే ఉంటాం. ఈ ఏడాది కూడా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కార్లలో ప్రయాణిస్తున్న వాళ్లు భయంతో వణుకుతున్నారు. చల్లగా ఏసీ వేసుకుని వెళ్లడం మాట అటుంచి, ఎక్కడ మంటలు చెలరేగి ప్రాణాలు పోతాయేమోనని భయపడుతున్నారు. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాహనాల్లో మంటలు చెలరేగకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
ఎలక్ట్రిక్ వాహనాలే కాదు, సంప్రదాయ వాహనాల్లోనూ మంటలు
ఎలక్ట్రిక్ వాహనాల్లోనే ఆకస్మాత్తుగా మంటలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని గతంలో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలే కాదు, సంప్రదాయ వాహనాలు సైతం అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎలక్ట్రిక్, డీజీల్, పెట్రోల్ సహా గ్యాస్ తో నడిచే వాహనాలల్లో కూడా మంటలు చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులు రోజూ 42 డిగ్రీలకుపైనే ఎండ తీవ్రత నమోదు అవుతున్నది. కార్ల ఇంజన్లు వేగంగా వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మంటలు అంటుకుంటున్నాయి.
ఎలక్ట్రికల్ వైరింగ్ విషయంలో జాగ్రత్తలు ముఖ్యం
వేసవిలో వాహనాల సర్వీసింగ్ విషయంలో ఎలాంటి ఆశ్రద్ధ చూపించినా ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. అంతేకాదు, కారుకు అదనపు హంగుల విషయంలోనూ జాగ్రత్తలు అవసరం అంటున్నారు. ఫాగ్ లైట్ల కోసం కోసం సరికొత్త వైరింగ్ ఏర్పాటు చేస్తారు. నాణ్యత లేని వైర్లను వాడటం మూలంగా త్వరగా వేడెక్కి మంటలు ఏర్పడుతాయి. అంతేకాదు, అదనపు పవర్ కోసం బ్యాటరీకి నేరుగా వైర్లను ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కూలెంట్ లెవల్స్ సరిగా పట్టించుకోకపోవడం, నాణ్యతలేని ఎలక్ట్రికల్ వైర్ల వినియోగం వల్ల షార్ట్ సర్క్యుట్ జరిగి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది.
కారు కండీషన్ చెక్ చేయండి
వేసవిలో కారు ప్రయాణం చేసే సమయంలో కారు కండీషన్ తప్పకుండా చెక్ చేయాలి. సైలెన్సర్, క్వాటలిక్ కన్వర్ట్స్ ఎక్కువగా వేడెక్కుతాయి. ఈ వేడికి దగ్గరున్న ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయే అవకాశం ఉంటుంది. ఫ్యూయల్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్, డీజిల్ లీక్ అయితే మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది.
వాహనాల్లో మంటలు రాకుండా ఉండాలంటే?
కొన్ని టిప్స్ పాటించడం వల్ల వేసవిలో వాహనాల్లో మంటలు రాకుండా కాపాడుకోవచ్చు. ఎండలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే, మధ్య మధ్యలో ఆగుతూ వెళ్లడం మంచిది. ఇంజిన్ వేడి తగ్గి మంటలు రావు. మంటలను ఆర్పేందుకు వాహనంలో చిన్న కార్బన్ డైయాక్సైడ్ సిలిండర్ తో పాటు కొంత నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. ఇంజిన్ నుంచి పొగ వచ్చినట్లు తెలియగానే వెంటనే ఇంజిన్ ఆఫ్ చేయాలి. వైరింగ్ సహా ఇంజిన్ లోని ఇతర భాగాలను పరిశీలించాలి. పొగ రావడానికి కారణాలను గుర్తించి సరిచేయాలి. వాహనాల్లో ఫాగ్ లైట్స్, ఇతర డెకరేషన్ లైట్స్ ఫిట్ చేయించేటప్పుడు జాగ్రతలు తీసుకోవడం మంచిది. వాహనాలను రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయించడంతో పాటు ఇంజిన్ ను పరిశీలిస్తూ ఉండాలి. వాహనాలను వీలైనంత వరకు నీడలోనే పార్క్ చేసేందుకు ప్రయత్నించాలి.