YSRCP MPs : ధరల నియంత్రణలో విఫలం - కేంద్రంపై వైఎస్ఆర్‌సీపీ విమర్శలు
ధరలను నియంత్రించడంలో మోదీ సర్కార్ ఫెయిలయిందని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విమర్శించారు. సామాన్యుడిపై మానవత్వం చూపించడం లేదన్నారు.
YSRCP MPs : ధరల నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమయిందని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు కేంద్రంపై మండిపడ్డారు. ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టిన పలువురు ఎంపీలు కేంద్రంపై తీవ్ర విమర్శలుచేశారు. సామాన్యుడి బతుకు గురించి కేంద్రానికి పట్టదా అని ఎంపీలు ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని.. వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.జీఎస్టీ నుంచి టీటీడీ, దేవాలయాలను మినహాయించాలన్నారు. ధరల పెంపునకు కొవిడ్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఇతర కారణాలు చూపుతున్న కేంద్రం.. మరి, అంతకు మించి కష్టాలు ఎదుర్కొంటున్న సామాన్యుడు ఎలా బతకాలి అని మానవత్వంతో ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు.
పేదలపై కనీస మానవత్వం చూపని కేంద్రం
ఒకవైపు పప్పు, ఉప్పులు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అన్నీ సామాన్యుడికి అందనంతగా పెరిగిపోయినా.. మరోవైపు జీఎస్టీ పేరుతో మోయలేని ట్యాక్స్ లు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ధరలు నియంత్రించి, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవ్వాలని చెబుతున్నారు. కరోనా వచ్చిన తొలి ఏడాది మన దేశానికి 19లక్షల కోట్లు ఆదాయం రాలేదు. రెండో ఏడాది 17లక్షల కోట్లు రూపాయల ఆదాయానికి గండి పడిందని ఎంపీ మార్గాని భరత్ చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వాలి
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్ట్ ద్వారా 960 మెగావాట్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కేంద్రం పోలవరం ప్రాజెక్టు కు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని ఇస్తేనే ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. అప్పుడు ఏపీ కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తయ్యేలా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలని ఎంపీలు కోరారు. హిందూయిజానికి తామే ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ... తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పైన కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దేవాలయాలను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేసినా దానిపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శిచారు.
ఏపీకి ఇవ్వాల్సిన రూ.18వేల కోట్లివ్వాలి !
కేంద్ర పన్నుల్లో వాటాగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మిగతా రాష్ట్రాలకు జీఎస్టీలో 42 శాతం రావాల్సి ఉంది, ఇప్పుడవి 31 శాతానికి పడిపోయాయి. ఏపీకి 46వేల కోట్లు రూపాయిలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. కాగ్ నివేదిక ప్రకారం ఏపీ రెవెన్యూ లోటు 18వేల కోట్లు బకాయిలను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేయాలని ఎంపీలు కోరారు. టీడీపీ ఎన్టీయే నుంచి బయటకు వచ్చాక, విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను, గత నాలుగేళ్లుగా విడుదల చేయలేదు. వాటన్నింటిని ఒకేసారి ఇస్తే క్యాపిటల్ ఎక్స్‌పెండించర్‌గా ఉపయోగించుకుంటామన్నారు. ఒడిశాకు ఇచ్చినట్లే ఏపీలో ఉన్న ఏడు వెనుకబడిన జిల్లాలకు కూడా కేబీకే ప్యాకేజీ ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.