(Source: ECI/ABP News/ABP Majha)
YSRCP Kapu Leaders Meeeting : ఉన్మాదిలా పవన్ మాటలు - వైఎస్ఆర్‌సీపీ కాపు నేతల ఫైర్ !
పవన్ కల్యాణ్ మాటలు ఉన్మాదంగా ఉన్నాయని వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలు మండి పడుతున్నారు. రాజమండ్రిలో ప్రత్యేకంగా సమావేశమై.. పవన్ తీరుపై మండిపడ్డారు.
YSRCP Kapu Leaders Meeeting : పవన్ విచక్షణ కోల్పోయి ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలు మండిపడ్డారు. ఆ పార్టీకి చెందిన కాపు సామాజికవర్గ నేతలంతా రాజమండ్రిలో సమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీఆర్‌పీకి ద్రోహం చేసినవారికి సమాధానం చెబుతానన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు వాళ్లతోనే స్నేహం చేస్తున్నారని విమర్సించారు. చంద్రబాబుకు దగ్గరై కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తున్నారని.. చంద్రబాబును సీఎం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న పవన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని విచక్షణ కోల్పోయి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారన్నారు. పవన్ వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు.
కాపులకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారన్న నేతలు
వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్‌సీపీ కాపు నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే టికెట్ల నుంచి నామినేటెడ్ పదవుల వరకూ కాపులకు సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంక్‌గానే చూశాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కాపు సామాజిక వర్గానికి సీఎం జగన్ కాపుల సంక్షేమానికి శ్రీకారం చుట్టారని.. ఆర్థికంగా అభివృద్ధి చెందే విషయంలో కాపులకు అండగా నిలిచారన్నారు. కాపుల సమస్యలు ఉంటే సీఎం జగన్ దృష్టికి తీసుకెళతామన్నారు. పవన్ పై నేరుగా బొత్స విమర్శలు చేయలేదు. ఇటీవల ఓ పార్టీ సెలబ్రిటీ అధినేత మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని.. త్వరలో విజయవాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని బొత్స ప్రకటించారు.
రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు !
కాపులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారు. గతంలో రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేయడమే కాకుండా ముద్రగడ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్ కల్యాణ్ కాపు ఎమ్మెల్యేలను పవన్ దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి దిగజారి మాట్లాడతారా?, రంగా మరణానికి పవన్ కల్యాణ్ కొత్త భాష్యం చెప్పారు. రంగా హత్యకు కారణమైన చంద్రబాబుతో పవన్ జట్టుకట్టారని ారోపించారు. టీడీపీ హయాంలో కాపులను వేధిస్తే.. సీఎం జగన్ అన్ని రకాలుగా అండగా నిలిచారు.పవన్ ముసుగు తొలగింది.కాపు సోదరులు ఆ విషయం గుర్తించాలని మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.
రంగా హత్య గురించి పవన్ నిజాలు తెలుసుకోవాలి..!
రంగా హత్యగురించి పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి దాడిశెట్టి రాజా పవన్ కల్యాణ్‌కు సూచించారు. రంగా హత్యపై పవన్ కల్యాణ్ తప్పుగా మాట్లాడారన్నారు. ప్రాణహాని ఉందని వంగవీటి రంగా చెప్పినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రంగాను చంద్రబాబే హత్య చేయించారని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారని గుర్తు చేశారు. ఆ రోజు ఏం జరిగిందో హోంమంత్రిగా ఉన్న హరిరామజోగయ్య చెప్పారన్నారు. కాపుల సమస్యలపై త్వరలో సీఎంను కలుస్తామని..మరోసారి విజయవాడలో సమావేశం కావాలని వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలు నిర్ణయించుకున్నారు.