Payyavula Vs Buggana: ఏపీ అప్పులపై పయ్యావుల అడిగిన ప్రశ్నలేంటి? బుగ్గన సమాధానలేంటి?
ప్రభుత్వ అప్పులపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్, ఆర్థిక మంత్రి బుగ్గన మధ్య వార్ నడుస్తోంది. అప్పు ఒప్పందాల రహస్యాలపై కేశవ్ ప్రశ్నించగా .. ఆ అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదని బుగ్గన చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల తీసుకోవడంపై.. పయ్యావుల వర్సెస్ బుగ్గన నడుమ మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం రాజ్యాంగ మౌలిక సూత్రాలు, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందని పయ్యావుల ఆరోపిస్తున్నారు. అప్పుకోసం సార్వభౌమాధికార రక్షణను వదులుకునేలా ఒప్పందాలపై సంతకాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల కోసం ప్రభుత్వం రహస్య ఒప్పందాలు చేసుకుంటోదని చెబుతున్నారు.
ఈ మాటలపై స్పందించిన బుగ్గన... రుణం చెల్లిస్తున్నంత వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఒప్పందం ప్రస్తావనే రాదని చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలకే అప్పులు చేశామని వివరణ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ .. ఏపీఎస్డీసీ చేసిన అప్పులను గుట్టుగా పెట్టారనడం సరికాదన్నారు. జీవో నంబర్లు చెబుతూ గుట్టు అనడమేంటని ప్రశ్నించారు.
అప్పులు దాచిపెడుతున్నారా?
అప్పుల విషయాన్ని శాసనసభకు తెలపకుండా రహస్యంగా దాచారని పయ్యావుల ఆరోపించారు. సహజంగా ఏ అప్పు చేసినా.. లేదా ప్రభుత్వం ఏ గ్యారెంటీ ఇచ్చినా బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టే సమయంలో దాన్ని రాష్ట్ర శాసనసభకు వాల్యూమ్ 5/2 అనే పుస్తకంలో తెలపాలని చెప్పారు. అయితే ప్రభుత్వం అప్పులను ఆ పుస్తకంలో తెలియజేయకుండా దాచిందన్నారు. బ్యాంకులకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వనందున ఆ పుస్తకంలో రాయలేదని ఆర్థిక మంత్రి బుగ్గన చెబుతున్నారని.. బ్యాంకులేమో గ్యారెంటీలు ఉన్నాయంటున్నాయని తెలిపారు. ఆ విషయాన్ని శాసనసభకు వెల్లడించకుండా దాచిపెట్టిందన్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా? అని పయ్యావుల కేశవ్ రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
అప్పు కడుతుంటే ఒప్పందమే అమల్లో ఉండదు
ఆబ్కారీపై వచ్చే పన్నును (ఏఆర్‌ఈటీ) అప్పు కట్టడానికి కేటాయించామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెబుతున్నారు. ఏఆర్‌ఈటీని ఉపసంహరించుకుంటే లేదా రద్దు చేస్తే ఈ ఒప్పందం ప్రస్తావన వస్తుందన్నారు. అప్పు కడుతున్నంత వరకు ఒప్పందమే అమల్లో ఉండదని.. అలాంటప్పుడు గ్యారంటీ ప్రస్తావన ఎందుకొస్తుందని ప్రశ్నించారు. గ్యారంటీ అమల్లో లేదు కాబట్టే శాసనసభలో 5/2 బుక్ చూపించలేదన్నారు. ఇంత సాధారణ భాషలో ఉన్నది కేశవ్ అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. అప్పులకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారని.. రూ.90 వేల కోట్ల నుంచి రూ.2.60 లక్షల కోట్ల వరకు అప్పులు చేసిన మీరు తీసుకున్నారా అని పయ్యావులను ఉద్దేశించి బుగ్గన ప్రశ్నించారు.
రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా నిధులను ఎస్క్రో చేస్తామని.. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని పయ్యావుల ఆరోపిస్తుండగా.. అప్పులు తీసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని బుగ్గన చెబుతున్నారు. ఒప్పందాన్ని రహస్యంగా ఉంచాలని అగ్రిమెంటులో ప్రస్తావించటం వెనక ఆంతర్యం ఏమిటని పీఏసీ ఛైర్మన్ నిలదీయగా.. అసలు రహస్యం ఎక్కుడుందని బుగ్గన అంటున్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కేసులు పెట్టొచ్చని స్పష్టంగా అగ్రిమెంటులో పేర్కొన్నారని.. గవర్నర్ మీద కేసులు పెట్టినా ఫర్వాలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా అని పయ్యావుల ప్రశ్నించగా.. ఆహ్వాన పత్రికల్లో గవర్నర్‌కు హిజ్ ఎక్స్‌లెన్సీ వాడతారని, జీవోల్లో అలా అనరని బుగ్గన చెప్పుకొచ్చారు.