Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - జనవరి 5న ఆ టోకెన్లు జారీ, ఎక్కడ ఇస్తారంటే?
TTD: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5న టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మహతి ఆడిటోరియం, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
TTD Tokens Issued To Locals For Srivari Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. శ్రీవారి దర్శనం కోసం వచ్చే స్థానికులకు వచ్చే ఏడాది జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ (TTD) తెలిపింది. కాగా, ఇటీవల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతీ నెల మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి 7న మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డులు చూపించి టోకెన్లు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ నెల 25న..
మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను ఈ నెల 25న ఉదయం 11 గంటలకు, మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 26న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను సైతం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మార్పును భక్తులు గమనించాలని.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.gov.in లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు.
భక్తులకు గుడ్ న్యూస్
మరోవైపు, తిరుమలలో ఆధ్యాత్మిక, పర్యావరణ, వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యత, సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలందించేలా కసరత్తు చేస్తున్నట్లు ఈవో జె.శ్యామలరావు తాజాగా వెల్లడించారు. గత 6 నెలలుగా టీటీడీ చేపట్టిన కార్యక్రమాలతో పాటు సీఎం చంద్రబాబు విజన్ - 2047 ఆధునిక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని ప్రకటించారు. తుడా మాస్టర్ ప్లాన్‌లో భాగంగా.. ప్రస్తుత అవసరాలకు వసతులు సరిపోవడం లేదని అన్నారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం ద్వారా 18 ప్రాజెక్టులకు సంబంధించి ప్రణాళికలు అందించేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానించామని చెప్పారు.
గడిచిన 6 నెలల్లో లడ్డూ ప్రసాదం రుచి పెంచడం సహా నెయ్యి పరీక్షలు చేయడం, బయటి ల్యాబుల్లో ముడిసరుకు నాణ్యతను మెరుగుపరచడం, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు నాన్ స్టాప్ అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. తిరుమలలోని హోటళ్లలో రుచికరమైన వంటకాలు, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం వంటివి చేపట్టామని అన్నారు. దాతల విశ్రాంతి గృహాలకు దేవుళ్ల పేర్లు మాత్రమే ఉంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. టీటీడీ సేవల్లో పారదర్శకత, సామర్థ్యం పెంచేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. యాత్రికుల వసతి, దర్శనం, ఇతర సేవలు వేగవంతం చేసేందుకు మాన్యువల్ కార్యకలాపాలకు బదులుగా ఆటోమేషన్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సేవ కోసం ఏఐ చాట్ బాట్‌ను కూడా పరిచయం చేయాలని ఆలోచిస్తున్నట్లు వివరించారు.