TTD On Caution Deposit : కాషన్ డిపాజిట్ పై ఆరోపణలు, టీడీపీ ఎమ్మెల్సీపై కేసు పెట్టిన టీటీడీ!
TTD On Caution Deposit : కాషన్ డిపాజిట్ ను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుందని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి చేసిన విమర్శలపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. ఆయనపై తిరుమల టు టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది.
TTD On Caution Deposit : కాషన్ డిపాజిట్ ప్రారంభించి దాదాపుగా ఏడాది కావస్తోంది. ఏడాది తరువాత ఓ నాయకుడి హాట్ హాట్ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. శ్రీవారి ఆలయం ముందు ఆ నాయకుడు చేసిన విమర్శలపై టీటీడీ స్పందించింది. భక్తులు అవాస్తవాలను నమ్మొద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తూ, విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా టీటీడీపై విమర్శలు చేయడం తగదని సూచించింది టీటీడీ. కాషన్ డిపాజిట్ సొమ్మును భక్తుల ఖాతాల్లోకి జమచేస్తున్నామని తెలియజేసింది. ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేసిన ఎంఎల్‌సీ బీటెక్ రవిపై టీటీడీ అధికారులు సోమవారం తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కస్టబర్ బ్యాంక్ జాప్యం
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కరెంట్ బుకింగ్, ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో గదులు బుక్ చేసుకుంటున్నారు. భక్తులు గదులు ఖాళీ చేసిన తరువాత రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు కాషన్ డిపాజిట్ రిఫండ్ ఎలిజిబిలిటి స్టేట్‌మెంట్‌ను ఫెడరల్ బ్యాంకు లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు పంపిస్తుంది టీటీడీ. ఈ బ్యాంకుల అధికారులు అదేరోజు అర్థరాత్రి 12 గంటలలోపు(బ్యాంకు పనిదినాల్లో) సంబంధిత మర్చంట్ సర్వీసెస్‌కు పంపుతారు. మర్చంట్ సర్వీసెస్ మరుసటిరోజు కస్టమర్ బ్యాంకు అకౌంట్‌కు పంపిస్తుంది. కస్టమర్ బ్యాంకు సంబంధిత అమౌంట్ కన్ఫర్మేషన్ మెసేజ్‌ను, సొమ్మును సంబంధిత భక్తుల అకౌంట్‌కు పంపుతుంది. కస్టమర్ బ్యాంక్ భక్తుల అకౌంట్‌కు సొమ్ము చెల్లించడంలో జాప్యం జరుగుతోందని టీటీడీ గుర్తించింది. ఒకవేళ భక్తులు యాత్రికుల సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్, ఈ-మెయిల్ ద్వారా సమస్యను టీటీడీ దృష్టికి తీసుకొచ్చిన పక్షంలో సంబంధిత బ్యాంకుల్లో విచారణ చేయాలని భక్తులకు సూచిస్తుంది.
యూపీఐ విధానంలో రిఫండ్
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంక్ ఏడు పనిదినాల్లో కాషన్ డిపాజిట్ రిఫండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జులై 11 నుంచి 4, 5 రోజుల్లో రిఫండ్ చేరే విధంగా టీటీడీ యుపీఐ విధానంలో రిఫండ్ చేస్తుంది. దీనివల్ల నేరుగా భక్తుల అకౌంట్‌కే రిఫండ్ సొమ్ము చేరుతోంది. ఇదిలా ఉంటే కొందరు పనిగట్టుకుని కాషన్ డిపాజిట్‌కు సంబంధించి టీటీడీపై దుష్ప్రచారం చేయడం మంచిది కాదని, వాస్తవంగా కాషన్ డిపాజిట్ సొమ్ము నేరుగా భక్తుల ఖాతాలకే చేరుతుందని అధికారులు అంటున్నారు. కాషన్ డిపాజిట్ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ వినియోగించుకుంటున్నాయని ఆరోపించడం శోచనీయమన్నారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలియజేస్తోంది.
Also Read : Ministry Of Power : తెలంగాణకు కేంద్రం మరో షాక్, నెల రోజుల్లో ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశం
Also Read : మంగళగిరిలో చిరంజీవి Vs లోకేష్!