Ministry Of Power : తెలంగాణకు కేంద్రం మరో షాక్, నెల రోజుల్లో ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశం
Ministry Of Power : ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను 30 రోజుల్లో చెల్లించాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. మొత్తం బకాయిలతో పాటు లేట్ పేమెంట్ కలిపి చెల్లించాలని తెలిపింది.
Ministry Of Power : తెలంగాణ నుంచి ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు 30 రోజుల్లో చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బాకాయిలను చెల్లించేలే ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఎప్పటి నుంచో కోరుతుంది. ఏపీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన విద్యుత్ బాకాయిలు చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది. జూన్ 2, 2014 నుంచి జూన్ 10, 2017 వరకు పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిలు రూ.3441.78 కోట్లు, దీనిపై లేట్ పేమంట్ రూ. 335.14 కోట్లు కలిపి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
సీఎం జగన్ భేటీతో
ఏపీకి నెల రోజుల్లో విద్యుత్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సోమవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇటీవల ఏపీ సీఎం జగన్ దిల్లీలో పర్యటించి ప్రధాని మోదీతో సహా, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇప్పించాలని కోరారు. విభజన సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కోరారు. విభజన సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల దిల్లీలో సమావేశమైంది. తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై ఏపీ ప్రభుత్వం కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే తెలంగాణ అధికారులు ఏపీ నుండి డబ్బులు రావాల్సి ఉందని అంటున్నారు.
విద్యుత్ బకాయిల వివాదం
ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంచాయితీ ఎప్పటి నుంచో నడుస్తోంది. విజభన అనంతరం విద్యుత్ సరఫరాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఈ బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించింది. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి రూ.3,441 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వవలసి ఉందని, 2017 జూన్ నాటికి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందని తమ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినప్పటికీ ఏపీకి చెల్లించాల్సిన బిల్లులు చెల్లించలేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. తెలంగాణ నుంచి మొత్తంగా తమకు రూ.6283 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సిఉందని ఏపీ ప్రభుత్వం అంటోంది. బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం పలుమార్లు లేఖలు కూడా రాసింది.
తెలంగాణ వాదన మరోలా
ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు తమకు డబ్బులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఏపీ నుంచి రూ. ఐదు వేల కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. విద్యుత్ బకాయిలపై లెక్కలు చూసుకుందామని ఏపీ విద్యుత్ సంస్థలకు లేఖలు రాశామని, అయినా ఏపీ లెక్కలు చూడడం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. డిస్కంల నుంచి బకాయిలు ఉంటే వాటిని వసూలు చేసుకోవాలని కానీ, జెన్కోకు చెల్లించాల్సిన డబ్బులను నిలిపివేయడం సరికాదని తెలంగాణ అంటోంది. ఏపీ, తెలంగాణ మధ్య ఈ విద్యుత్ వివాదంపై జాతీయ కంపెనీల ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ నుంచి కేసును వాపస్ తీసుకుంది. ఏపీ ప్రభుత్వం మాత్రం విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణపై ఒత్తిడి చేస్తూనే ఉంది. తాజాగా సీఎం జగన్ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించారు. ఈ పరిణామాల మధ్య కేంద్రం తెలంగాణకు కీలక ఆదేశాలు జారీచేసింది. నెల రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.
Also Read : మంగళగిరిలో చిరంజీవి Vs లోకేష్!
Also Read : సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సీఎం జగన్ తరఫున బుగ్గన