Srikakulam Stampede News: "అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Srikakulam Stampede News: శ్రీకాకుళంజిల్లా కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటనలో పూర్తి బాధ్యత గుడి నిర్వాహకులదేనని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఆలయం కొత్తగా నిర్మించారని దేవాదాయశాఖ పరిధిలో లేదని తెలిపింది

Srikakulam Stampede News: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 9మంది చనిపోయారు. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇందులో అధికారులు, ప్రభుత్వం తప్పేమీ లేదని స్పష్టం చేసింది. పూర్తిగా దీనికి నిర్వాహకులదే బాధ్యతని పేర్కొంది.
కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం జులైలో ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత జరుగుతున్న తొలి ఏకాదశి దర్శనల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం రెయిలింగ్ విరిగిపడడంతో గందరగోళం నెలకొంది. దీంతో 9 మంది అక్కడ చనిపోయారు. చనిపోయినవారంతా మహిళలు, చిన్నారులే ఉన్నారు. దుర్ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పాట్‌కు వచ్చారు. అక్కడ పరిస్థితి చక్కబెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. పలాస మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు స్వయంగా వైద్యుడు కావడంతో వెంటనే స్పాట్‌కు వచ్చి భక్తులను రక్షించే ప్రయత్నం చేశారు. భక్తులను రక్షించేందుకు ఎవరి ప్రయత్నం వాళ్లు చేశారు.
ఇది దేవాదాయ శాఖ ఆధ్వరంలో నడుస్తున్న దేవాలయం కాదని అధికారులు వివరణ ఇచ్చారు. పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధ్వరంలో నడుస్తోందని తెలిపారు. దీన్ని గత జులైలోనే ప్రారంభించారని పూర్తిగా అక్కడ వ్యవహారాలన్నీ ప్రైవేటు వ్యక్తులే చూసుకుంటున్నారని అన్నారు. తిరుమలపై అలిగిన వ్యక్తులు తమ కోసం ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. అందులోనే తొలిసారిగా ఏకాదశి పూజలు నిర్వహించారని అంటున్నారు. ఈ ఆలయం సామర్థ్యం కేవలం ఐదారు వేలు మాత్రమేనని చెబుతున్నారు. వచ్చిన భక్తులు మాత్రం దాదాపు ఇరవై వేలకు మించి ఉంటారని వివరించారు.
ప్రైవేటు గుడి కావడంతో అక్కడ భద్రత గురించి స్థానికంగా ఉండే అధికారులతో సమాచారం ఇచ్చి ఉంటే చర్యలు తీసుకునే వాళ్లమని అధికారులు అంటున్నారు. అసలు దీనిపై తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని, వేడుక చేస్తున్నట్టు కూడా స్థానికంగా అధికారులకు తెలియదని పేర్కొన్నారు. నిర్వాహకుల వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందని దేవాదాయశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే 9మంది వరకు మృతి చెందారు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
దేవాదాయ శాఖ మంత్రి ప్రకటన ఇదే " కాశీబుగ్గ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులు అధీనంలో ఉన్న దేవాలయం. ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నదని, దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. సుమారు 2000 మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25 వేల మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఇంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి సమాచారం ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు అందించలేదు" అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు.





















