(Source: Poll of Polls)
Srikakulam Stampede News:శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం- కాశీబుగ్గలోని ఆలయంలో తొక్కిసలాట- 9 మంది మృతి
Kasibugga Stampede News:శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.

Kasibugga Stampede News: శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలోని వెంకటేశ్వర టెంపుల్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులకు స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఏకాదశి కావడంతో వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన రేయిలింగ్ ఊడిపోవడంతో ఒక్కసారిగా జనం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది.
దుర్ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఆలయానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆలయంలో దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు. అక్కడ పరిస్థితులు చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమతో పూజల కోసం వచ్చిన వారు ఇలా మృత్యువాత పడటం బంధువులు రోధిస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నారు.
కాశీబుగ్గ బయల్దేరిన మంత్రి అచ్చెన్న
తొక్కిలాట ఘటనపై రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాలోనే ఉన్న అచ్చెన్నాయుడు వెంటనే కాశీబుగ్గ బయల్దేరి వెళ్లారు. ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిందని, గాయపడిన వాళ్లకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. ఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలు తరలించినట్టు వెల్లడించారు.
కాశీబుగ్గ దుర్ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఏం జరిగిందో చెప్పాలని బాధితులకు అండగా ఉండాలని స్థానిక నాయకులు, జిల్లా అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలని చెప్పారు.
ఆవేదన వ్యక్తం చేసిన లోకేష్
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏకాదశి రోజు తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోందన్నారు. సమాచారం అందిన వెంటనే అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడామని పేర్కొన్నారు. బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించామని వెల్లడించారు.
కాశీబుగ్గ వెళ్తున్న దేవాదాయ శాఖాధికారులు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటన గురించి దేవాదాయ శాఖ ఉన్నత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే జిల్లా మంత్రి అచ్చం నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడిన వివరాలు అడిగి తెలుసుకున్నామని వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని మంత్రి ఆనం అదేశించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు హుటాహుటిన శ్రీకాకుళం బయలుదేరిన వెళ్లారు.





















