Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Telangana Jagrutis Janam Bata Yatra | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

Telangana Politics | కరీంనగర్: తెలంగాణలో కచ్చితంగా రాజకీయ శూన్యత ఉందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలను నమ్ముకొని దగాపడ్డం అని ప్రజలు చెబుతున్నారని, తమ ప్రాధాన్యం ప్రజల సమస్యలు తీర్చటమేనన్నారు. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ ఎన్నికలో బిజీగా ఉన్నారని, తాము ప్రజల గొంతుకగా మారుతాం అన్నారు. మొంథా తుపానుతో రైతులు నష్టపోయినా ఎవరూ పట్టించుకుంటలేరు. వరంగల్ నగరం నీటిలో మునిగితే పోరాటం చేయాల్సి పార్టీలు పట్టించుకోలేదు. రెండు పక్షాలు ప్రజల కోసం తిరగటం లేదు, కనుక బాధితుల తరఫున మేం పోరాటం చేస్తాం. జాగృతి రాజకీయ వేదికే. మేము చాలా సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడాం. జాగృతి ది తెలంగాణ లైన్. మేం ప్రజల కోసమే పోరాడుతామని కవిత అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికుల చట్టాలు వారి హక్కులను కాలరాస్తున్నాయని, దీనిపై కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు చేయాల్సినంత స్థాయిలో పోరాటం చేయలేదని కవిత విమర్శించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ రైతు చట్టాల గురించి మాట్లాడినప్పటికీ, కార్మికులకు అన్యాయం చేసే లేబర్ చట్టాల గురించి మాట్లాడకపోవడాన్ని ఆమె ప్రస్తావించారు. రైతు చట్టాలను మార్చగలిగినా, కార్మికులకు అన్యాయం చేసే చట్టాలలో మార్పు రాకపోవడం పట్ల ప్రధాన పార్టీలు దృష్టి సారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లెఫ్ట్ పార్టీలు ప్రయత్నించినా వారి శక్తి సరిపోలేదన్నారు. మోదీ కారణంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, కార్మికుల కోసం పోరాడిన వ్యక్తినని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక రావడంతో ఎమర్జెన్సీగా మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. అదే ఎమర్జెన్సీలో మైనార్టీల కోసం ఏటా రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయాలని, మైనార్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు
ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యపై మండలిలో తాను మాట్లాడిన తర్వాతే ముఖ్యమంత్రి రూ. 700 కోట్లు విడుదల చేశారని కవిత గుర్తుచేశారు. అయితే, ప్రతి నెలా నిధులు విడుదల చేస్తామని చెప్పినా చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల పేద విద్యార్థులు స్కూల్ మానేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తే వారికి మద్దతుగా ఉంటామని, ఆడపిల్లలు చదువు నష్టపోకుండా ఉండేందుకు స్కూల్స్ బంద్ కాకుండా పోరాటం చేస్తామని ప్రకటించారు. బుద్ధి జీవులంతా ఈ పరిస్థితులపై ఆలోచించాలని పిలుపునిచ్చారు.
రాజకీయ కార్యాచరణ
తనను కొందరు వారి బాణం, వీరి బాణం అని అంటున్నారని, కానీ తాను తెలంగాణ ప్రజల బాణాన్ని అని కవిత స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే తమ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి 'జనం బాట' పూర్తయిన తర్వాత తమ ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. హడావుడిగా ప్రకటనలు చేయబోమని, అవసరమైతే మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లి వారి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు.
ఎమ్మెల్సీ రాజీనామా, నియోజకవర్గ పునర్విభజన
తన రాజీనామాను యాక్సెప్ట్ చేయమని తాను కోరినా, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో వారికే అర్థం కావడం లేదని కవిత అన్నారు. రాజీనామా యాక్సెప్ట్ చేస్తే ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీని చేయాలనే ఆలోచన వారికి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. ఛైర్మన్ తన రాజీనామాపై తనతో మాట్లాడకుండా చిట్ చాట్‌లో మాట్లాడుతున్నారని, మరోసారి ఆయనతో మాట్లాడి రాజీనామాను ఆమోదించాలని కోరుతానని తెలిపారు. వచ్చే మూడేళ్లలో చాలా మార్పులు వస్తాయని, ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణలో 69 మంది మహిళా ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. బీసీ రిజర్వేషన్లు, సామాజిక తెలంగాణ వీలైనంత త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇంకా రెండు నెలల సమయం కోరుతున్నారని, ఈ విషయాన్ని సాగదీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమకు ఎలాంటి స్టాండ్ లేదని స్పష్టం చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 23 మంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ, ఒక్క బీసీ గానీ, మహిళ గానీ ఎందుకు ముఖ్యమంత్రి కాలేదని ప్రశ్నించారు.
జాగృతి జనం బాటకు అద్భుత స్పందన
'జాగృతి జనం బాట' కార్యక్రమంలో భాగంగా మూడవ జిల్లాగా కరీంనగర్‌లో పర్యటించిన కవితకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. సామాజిక తెలంగాణ సాధనలో వెనుకడుగు వేయవద్దని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు, స్వరాష్ట్రం తెచ్చుకొని 12 ఏళ్లైనా పరిస్థితిలో మార్పు రాకపోవడం, కనీసం విద్య, వైద్యం కూడా ప్రజలకు అందించలేకపోవడం తన ఆవేదనకు కారణమని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు పదేపదే ఇదే సమస్యను చెబుతున్నారని అన్నారు.
ఉద్యమ స్ఫూర్తి ఆవశ్యకత
ఆర్టీసీ, సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే విధంగా చట్టాలు చేశారని, పోరాడితే తప్ప ఏదీ రానటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు. మోడీ కార్మికుల విషయంలో నల్ల చట్టాలు తెచ్చినా మనం స్పందించలేదని, మన హక్కులను కాపాడుకోవడానికి తెచ్చుకున్న తెలంగాణలో ఆ పోరాట తత్వం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. సమసమాజం రావాల్సిన అవసరం ఉందని, సమస్యలు తీరాలంటే పిడికిలి బిగించి ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. విప్లవాత్మక మార్పు రావాల్సిన అవసరముందని, లేదంటే ఇంకా ఎన్నాళ్లు ఇతర దేశాలలో ఉద్యోగాల కోసం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీలిపైన్స్ లాంటి చిన్న దేశం కూడా ఎమిరేట్స్‌ను ధిక్కరించి మినిమమ్ వేతన చట్టం చేసిందని, కానీ మన దేశం పట్టించుకోవడం లేదని ఉదహరించారు.
రిజర్వేషన్లపై పోరాటం
మహిళలు 50 శాతం ఉన్నా అధికారంలో తగిన ప్రాతినిధ్యం లేదని, 50 శాతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటే ఎవరూ మాట్లాడలేదని గుర్తుచేశారు. అలాగే, 52 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని అంటున్నా ఊరుకుంటున్నామని, ఒక్కసారి ఊరుకుంటే మళ్లీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోతామని హెచ్చరించారు. అందరం కలిసి పోరాటం చేస్తేనే మార్పు వస్తుందని పునరుద్ఘాటించారు.
కరీంనగర్ జిల్లా సమస్యలు, అభివృద్ధి
కరీంనగర్ జిల్లా శాతవాహన రాజులు పాలించిన ప్రాంతమని, ఇక్కడి చిన్న వల్లభుని శాసనం ద్వారానే తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిందని కవిత అన్నారు. ఆ శాసనం ఉన్న బొమ్మలమ్మగుట్టను కాపాడటానికి ఎంతో కష్టపడ్డామని గుర్తుచేసుకున్నారు. హుజురాబాద్, మానకొండూరులలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, దీనిపై అందరూ ఆలోచించాలని అన్నారు. కరీంనగర్ నుంచి వేములవాడకు వెళ్లే మార్గం దుమ్ముతో నిండిపోయిందని తెలిపారు. ఇక్కడ చేపట్టిన బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందో బండి సంజయ్ చెప్పాలని, దీనిపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్టు వద్ద మత్తడి కొట్టుకుపోయి మూడేళ్లు గడుస్తున్నా పట్టించుకోవట్లేదని, దీనికి శాశ్వత పరిష్కారం కావాలని, ఇప్పటికే విడుదల చేసిన రూ. 70 కోట్లను తక్షణమే ఇవ్వాలని కోరారు. ఆరగండ్ల, కన్నపూర్ రోడ్లను, గుండ్లపల్లి, గన్నేరు వరం రోడ్డును త్వరగా బాగు చేయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ఎయిర్‌పోర్ట్ గురించి ఎవరూ మాట్లాడటం లేదని, నిజామాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ కోసం ప్రయత్నం చేశామని, వరంగల్‌లో దాదాపు రానుందని తెలిపారు. కరీంనగర్ నుంచి తిరుపతి, ముంబై, షిర్డీకి రైళ్లు నడపాలని కోరారు.
ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్..
గ్రానైట్ ఆదాయాన్ని ఈ జిల్లా అభివృద్ధికి వినియోగించాల్సిన అవసరముందని, గ్రానైట్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. సహజ వనరులు వాడుకోవడాన్ని వ్యతిరేకించడం లేదని, కానీ 10 మీటర్లు అంటే 100 మీటర్లు తవ్వడానికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. గతంలో తాను కొన్ని బంధనాల్లో ఉండేదానిని, కానీ ఇప్పుడు 'ఫ్రీ బర్డ్'నని, గ్రానైట్ మాఫియాపై పోరాటం చేస్తానని అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం వెయ్యి కోట్లు కేటాయించినా, ఇప్పటికీ స్మార్ట్ సిటీ అవ్వలేదని విమర్శించారు. ఇక్కడ కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదని, డైరెక్టుగా మానేరులోకి డ్రైనేజీ నీటిని డంప్ చేస్తున్నారని తెలిపారు. స్మార్ట్ సిటీ విషయంలో బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు.
ఐటీ టవర్, శిల్ప కళాకారులు
ఇక్కడ ఏర్పాటు చేసిన ఐటీ టవర్ లో కంపెనీలు పారిపోయాయని, మంత్రి శ్రీధర్ బాబు దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. రామడుగులో ఉన్న శిల్పకళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, వారికి 5 ఎకరాల జాగ ఇవ్వాలని, వారి ఖార్ఖానాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొంథా తుపాను కారణంగా నష్టపోయిన వరంగల్, ఖమ్మం జిల్లాలే కాకుండా అన్ని జిల్లాల రైతులకు ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వెల్ఫేర్ హాస్టల్స్‌లో జరుగుతున్న మరణాలు తనను బాధిస్తున్నాయని, గత ఏడాదిన్నర కాలంలో 110 మంది పిల్లలు చనిపోయారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ వర్షిత అనే అమ్మాయి హాస్టల్‌లో చనిపోయిన ఘటనపై ఏం జరిగిందో తెలియాలని, తల్లిదండ్రులు పిల్లలను పంపించాలంటే పరిస్థితులు మారాలని కోరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ విషయాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.






















