Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
Amalapuram Crime News: అమలాపురంలో ఓ వ్యక్తి దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. కిడ్నాప్, ఆపై హత్య చేసి మృతదేహాన్ని వశిష్ట నదీపాయలో పడేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.

Amalapuram Crime News: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అయిన అమలాపురంలో ఓ వ్యక్తి దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకప్పడు ఆధిపత్య పోరు. మరోపక్క పాతకక్షలు వెరసి దారుణంగా ఉండే అమలాపురంలో చాలా కాలంగా ప్రశాంతంగా ఉంది. అయితే మళ్లీ పాతకక్షలు రాజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి దారుణ హత్య మళ్లీ కలకలం రేపింది..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లికి చెందిన వ్యక్తి వారం రోజులుగా అదృశ్యం కాగా మంగళవారం మధ్యాహ్నం నాటికి పి.గన్నవరం మండలం కె.ఏనుగుపల్లి వద్ద వశిష్ట నదీపాయలో డెడ్ బాడీ లభ్యం కావడంతో హత్యగాతేలింది. తన భర్తను హత్య చేసి ఉంటారనే అనుమానం ఉన్న వారిపై అతని భార్య దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది..
వారం రోజుల క్రితం స్నేహితులతో బయటకు వెళ్లిన తన భర్త కంచిపల్లి శ్రీను కనిపించడం లేదంటూ అమలాపురం పట్టణ పోలీసులకు శ్రీను భార్య ఫిర్యాదు చేసింది. అయితే తన భర్త ఆచూకీపై ఎటువంటి పురోగతి లేదని ఆరోపిస్తూ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు మృతుడి కుటుంబికులు, బంధువులు పెద్దఎత్తున వచ్చి ఆందోళనకు సిద్ధ పడ్డారు. ఈక్రమంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే ఆచూకీ పట్టుకుంటామని తెలపడంతో తాత్కాలికంగా విరమించుకున్నారు.
వశిష్ట నదీపాయలో మృతదేహం లభ్యం
మృతుడి కుటుంబికులు పోలీస్ స్టేషన్ ముట్టడించిన క్రమంలో అదే రోజు మధ్యాహ్నం పి.గన్నవరం వద్ద వశిష్ట నదీపాయలో ఓ మృతదేహం లభ్యమైంది. ఈ విషయంపై కంచిపల్లి శ్రీను కుటుంబికులకు పోలీసుల సమాచారం అందించారు. దాన్ని పరిశీలించిన కుటుంబికులు ఆ మృతదేహం శ్రీనుదేనని గుర్తించారు. మృతుడి శరీరంపై అతని భార్య, కుమార్తె పేరుతోపాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్ పచ్చబొట్టు ఉండగా ఇది శ్రీను డెడ్ బాడీనే అని నిర్ధారించారు. మృతదేహం దొరికిన పరిస్థితిని బట్టి చనిపోయి మూడు రోజులకుపైగా అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు.
శరీరంపై బలమైన కత్తిపోట్లు...?
ఈ నెల 25న సాయంత్రం ఇంటి నుంచి స్కూటీపై బయటకు వెళ్లిన కంచిపల్లి శ్రీను తిరిగి ఇంటికి రాకపోవడంతో 27వ తేదీన అమలాపురం పట్టణ పోలీసులకు శ్రీను భార్య ఫిర్యాదు చేసింది. అయితే తన భర్త ఆచూకీ లభ్యం కాలేదంటూ కుటుంబికులు, బంధువులతో బుధవారం పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముట్టడించారు. కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈక్రమంలోనే శ్రీను మృతదేహం కె.ఏనుగుపల్లి వద్ద వశిష్ట నదీపాయలో లభ్యం అయ్యింది. తన భర్తను కిడ్నాప్ చేసి చంపింది గంగుమళ్ల షణ్ముకేశ్వరరావు అలియాస్ కాసుబాబు అని మృతుడి భార్య ఆరోపించింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో మృతుడి శరీరం పై బలమైన కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. హత్యగా నిర్ధారించిన పట్టణ పోలీసులు గంగుమళ్ల షణ్ముకేశ్వరరావు అలియాస్ కాసుబాబు, అడబాల శంకర్, సలాది రాంబాబు అలియాస్ అప్పన్న, భాస్కర్ల ప్రసాద్ (డ్రైవర్), రావులపాలెం వాసి అనిల్ పై కేసు నమోదు చేశారు.
ఈ హత్య ఘటనపై కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా స్పందిస్తూ నిందితులను పట్టుకునేందుకు అయిదు బృందాలతో గాలిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని రోజులు క్రితం మృతుడు కంచిపల్లి శ్రీను నిందితుడు కాసుబాబు మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు చర్చ జరుగుతోంది..
దర్శకుడు సుకుమార్‌తో సన్నిహిత్యం..
మృతుడు కంచిపల్లి శ్రీనుకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ అంటే చాలా అభిమానం.. ఆయనను తరచూ కలిసి ఫోటోలు దిగేవాడు. ఈ క్రమంలోనే సినిమాలపై ఉన్న మక్కువతో సుకుమార్ వద్ద రంగ స్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఈ అభిమానంతోనే అతని కుడిచేతిపై సుకుమార్ రూపాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు..





















