Tirumala Srivari Mettu : నేటి నుంచి శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకు అనుమతి, త్వరలో దివ్య దర్శనం టోకెన్లు
Tirumala Srivari Mettu : శ్రీవారి మెట్టు మార్గంలో ఇవాళ్టి నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. గత ఏడాది నవంబర్ లో కురిసిన భారీ వర్షానికి మెట్టుమార్గం పూర్తిగా ధ్వంసం అయింది.
Tirumala Srivari Mettu : తిరుపతి చంద్రగిరి సమీపంలోని శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు కాలి నడకన వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో గురువారం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారిమెట్టు మార్గం పూర్తిగా దెబ్బతింది. ఆ తర్వాత రూ.3.6 కోట్లతో మార్గానికి మరమ్మతులు చేపట్టింది టీటీడీ. గురువారం ఉదయం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, ఇతర అధికారులు శ్రీవారి మెట్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఈ మార్గంలో తిరుమలకు అనుమతించారు. 800, 1200వ మెట్ల వద్ద వంతెనలు కూలిపోవడంతో అక్కడ నిర్మాణ పనులు పటిష్ఠంగా చేపట్టారు అధికారులు.
త్వరలోనే దివ్యదర్శనం టోకెన్లు
శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అంతకు ముందు శ్రీవారి మెట్టు ప్రారంభోత్సవంలో భాగంగా శ్రీవారి మొట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన అకాల వర్షాలకు శ్రీవారి మెట్టు పూర్తిగా దెబ్బతిందన్నారు. ఈ క్రమంలోనే ఘాట్ రోడ్డు తరహాలో మర్మమతులు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని దాదాపు రూ.3.60 కోట్లతో పునర్నించామని తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులకు త్వరలోనే దివ్య దర్శనం టోకెన్లను అందిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
నాలుగు నెలల వ్యవధిలోనే
ఈ మార్గం నుంచి ప్రతి రోజు ఆరు వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటాని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తు శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్లు, శ్రీ కృష్ణదేవరాయులు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో శ్రీవారి మెట్టు మార్గంలో పనులు పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది కాంట్రాక్టర్లను వైవీ సుబ్బారెడ్డి అభినందించారు.
Also Read : Spirituality-Vastu: మంచంపై కూర్చుని భోజనం చేస్తున్నారా, ఈ కష్టాలు తప్పవు