Tirumala: పాము కాటుకు గురైన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు... పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు...
టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పాము కాటుకు గురయ్యారు. శుక్రవారం రాత్రి ఓ విషసర్పాన్ని పట్టుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
తిరుమలలో వేల సంఖ్యలో పాములను పట్టుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పాము కాటుకు గురయ్యారు. పాములను పట్టడంలో సిద్ధహస్తుడైన భాస్కర్... అటవీ ప్రాంతం నుంచి తిరుమల, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకునే వారు. ఆ పాములను భాస్కర్ నాయుడు అటవీ ప్రాంతంలో జాగ్రత్తగా వదిలిపెట్టేవారు. పాము కనిపిస్తే చాలు టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి పిలుపువెళ్తుంది. ఎంత పెద్ద పామునైనా చాలా చాకచక్యంగా ఆయన పట్టేస్తారు. తాజాగా ఆయన తిరుమలలో ఓ పామును పట్టుకునే క్రమంలో అది కాటువేసింది. విషపూరితమైన పాము కావడంతో ఆయన్ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి పామును పట్టే సమయంలో భాస్కర్ నాయుడు కాటుకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి దాకా 10 వేలకు పైగా పాములను భాస్కర్ నాయుడు పట్టుకున్నారు. ఫారెస్టు మజ్దూర్ గా రిటైరైన భాస్కర్ నాయుడు టీటీడీలో సేవలు అందిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే టీటీడీ ఉద్యోగి మృతి..!
తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ టీటీడీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని సత్యనారాయణపురానికి చెందిన గజేంద్ర తిరుమల తిరుపతి దేవస్థానం కో-ఆపరేట్ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఇతనికి శుక్రవారం రాత్రి రెండు గంటల సమయంలో గుండె నొప్పి రావడంతో స్విమ్స్ హాస్పిటల్లో అత్యవసర విభాగంలో చేర్చారు. వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన అత్యవసర విభాగం వైద్యులు అతనికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఇవాళ ఉదయం వరకు బాగానే ఉన్న గజేంద్ర ఆరున్నర గంటల సమయంలో విపరీతమైన ఛాతి నొప్పితో పాటు కాళ్లు చేతులు బిగుసుకుపోవడం చూసి అతని సహాయకులు వైద్యుల దగ్గరకు వెళ్లి రమ్మని పిలిచారని బాధితులు అంటున్నారు. కానీ వాళ్లు రెండు నిమిషాలు ఆగు వస్తామని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గజేంద్ర ఆరున్నర గంటల సమయంలో తుది శ్వాస వదిలాడనీ ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. టీటీడీ స్విమ్స్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మెరుగైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. గజేంద్ర మృతికి కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు.