Chandrababu Case : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు - మధ్యంతర బెయిల్ కు నిరాకరణ
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇరువర్గాలు సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి.
Chandrababu Case : స్కిల్ డెలవప్‌మెంట్ కేసులో ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో పూర్తయింది. తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. చంద్రబాబుకు ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు కోరారు. అయితే తాము మెయిన్ పిటిషన్ పై వాదనలు విన్నామని.. దానిపై తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది. మధ్యంతర బెయిల్ పై నిర్ణయం తీసుకోలేమని పరోక్షంగా చెప్పినట్లయింది. దీంతో చంద్రబాబుకు తీర్పు వచ్చే వరకూ ఉత్కంఠ కొనసాగనుంది. శుక్రవారం లోపే తీర్పు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు దాఖలు చేసిన ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఎస్ఎల్పీ పై విచారణ ఆ రోజుకు ధర్మాసనం వాయిదా వేసింది.
శుక్రవారం లేదా ఆ తర్వాత తీర్పు ప్రకటించే అవకాశం
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ రాతపూర్వకంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. తాము కూడా అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని చంద్రబాబు తరపు లాయర్ సాల్వే సుప్రీంకోర్టుకు తెలిపారు. ధర్మాసనం అందుకు అంగీకరించింది. మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభమైన ముకుల్ రోహత్గీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 17ఏ సెక్షన్ వర్తించదన్నారు. వాదనల సందర్భంగా ధర్మాసనం పలు సందేహాలను లెవనెత్తింది. విచారణ ప్రారంభమయ్యే సరికి.. సెక్షన్ 17ఏ ఉంది కాబట్టి వర్తిస్తుందని న్యాయమూర్తి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
రాజకీయ కక్ష సాధింపుల కేసేనని చంద్రబాబు లాయర్ వాదన
గంటకుపైగా వాదనలను ప్రభుత్వం తరపు న్యాయవాది రోహత్గీ వినిపించారు. తర్వాత చంద్రబాబు తరపు లాయర్ వాదించారు. చంద్రబాబు తరఫున వర్చువల్‌గా వాదనలు వినిపించిన సాల్వే.. చట్ట సవరణను ముందు నుంచి వర్తింపచేసే అంశంపై వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందు నుంచి వర్తింపచేసే అంశంపై పలు తీర్పులను ఉటంకించారు. 2019 నాటి ‘శాంతి కండక్టర్స్’ కేసును ప్రస్తావించారు. ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ చట్టం కింద రక్షణ ఉంటుందని.. రాజకీయ కక్ష సాధింపులు లేకుండానే ఈ సెక్షన్ తీసుకు వచ్చారని.. ఎన్నికలకు ముందు ఈ తరహా రాజకీయ సాక్ష సాధింపులు ఉంటాయన్నారు.
తీర్పుపై ఉత్కంఠ !
ఈ కేసులో రిమాండ్ సమయంలో చంద్రబాబు చేర్చారని.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఏ వర్తిస్తుందని సాల్వే అన్నారు. రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయని .. విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా ఈ ప్రభుత్వం భావిస్తోందన్నారు. చంద్రబాబుకు 17ఏ సెక్షన్ వర్తిస్తే మొత్తం కేసులన్నీ తేలిపోయే అవకాశం ఉండంతో.. సుప్రంకోర్టు తీర్పుపై ఆసక్తి వ్యక్తమవుతోంది.