Rushikonda Supreme Court : రుషికొండలో నిర్మాణాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ - కానీ ప్రభుత్వానికి చిక్కులే
హైకోర్టులో కేసు తేలే వరకూ రుషికొండలో తవ్వకాలు వద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత రిసార్ట్ ఉన్న స్థానంలో మాత్రం కొత్త నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం ఇచ్చింది.
Rushikonda Supreme Court : రుషికొండలో కొత్తగా ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కూల్చి వేసిన పాత రిసార్టు ఉన్న ప్రదేశంలో మాత్రం కొత్త నిర్మాణాలు చేపట్టవచ్చని పేర్కొంది. రుషికొండలో తవ్వకాలపై హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వానికి సూచించింది. విచారణలో హైకోర్టులో ఎన్జీటీ తవ్వకాల అంశంపై పిటిషన్లు ఉన్నాయని న్యాయవాది చెప్పడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మరి హైకోర్టునే ఆశ్రయించవచ్చు కదా అని ప్రశ్నించింది. అయితే హైకోర్టుకు ప్రస్తుతం సెలవులు ఉన్నందున విచారణ ఆలస్యం అవుతోందని ఈ లోపు రుషికొండకు తీవ్ర నష్టం జరుగుతోందని వాదించారు.
రుషికొండపై ఎన్జీటీ విచారణ రద్దు - ఇక హైకోర్టులోనే విచారణ !
అయితే ఏపీ ప్రభుత్వ తరపు లాయర్ ఇప్పటికే సగం నిర్మాణాలు పూర్తయ్యాయని వాదించారు. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. పాత రిసార్టు ఉన్న ప్రాంతంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని.. కొత్తగా ఎలాంటి తవ్వకాలు వద్దని చెప్పడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురయినట్లేనని భావిస్తున్నారు. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని సుప్రీంకోర్టు తేల్చింది. హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి, హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టులో తేలే వరకూ ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది. హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యేవరకు తవ్వకాలు జరిపిన ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశిస్తూ గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు కల్పించింది.
పాత రిసార్ట్ ఉన్న స్థానాల్లో మాత్రమే కొత్త నిర్మాణాలు
అధికార వైసిపీకి చెందిన అసమ్మతి నేత, ఎంపీ రఘురామ కృష్ణం రాజు గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. రుషికొండపై జరుగుతున్నవి పూర్తిగా పర్యావరణానికి హాని కలిగించే కార్యక్రమాలు అంటూ పిటీషన్ దాఖలు చేసారు. దానిపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ స్టే ఆర్డర్ ఇస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎలాంటి తవ్వకాలూ రిషికొండపై చేపట్టరాదని తెలిపింది. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని ఎన్జీటీ నియమించింది. ఏపీ కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది
హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకూ తవ్వకాలు నిలిపివేత !
రిషికొండ సమీపంలో ప్రభుత్వానికి చెందిన హరితా రిసార్ట్స్ ఉండేవి. ఇక్కడి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకులకు ఈ రిసార్ట్స్ వసతి సౌకర్యం కల్పించేవి. అయితే అకస్మాత్తుగా వాటిని కూల్చేసిన ప్రభుత్వం ఇప్పుడు పెద్ద స్థాయి టూరిజం హోటల్ కడతామని రిషికొండను తవ్వేస్తున్నారు. అయితే ఆ మాట అధికారికంగా చెప్పడం లేదు. మరోవైపు ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం కోసం అని మరో వార్త వినబడుతుంది. అయితే భవనాలు కట్టడానికి ఏకంగా కొండను ఎందుకు తవ్వేస్తున్నారు.. సముద్ర తీర ప్రాంతంలో ఏకంగా కొండను తవ్వేయడంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.