Bharat Bundh : భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు - బస్సులు నిలిపివేయాలని నిర్ణయం!
27న రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. మధ్యాహ్నం వరకు బస్సు సర్వీసులు నిలిపివేస్తామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 27 న భారత్ బంద్ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఈ భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అనేక రైతు సంఘాలు కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాయని మంత్రి అన్నారు. అలాగే విశాఖ ఉక్కును కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేయవద్దని చేస్తున్న భారత్ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. బంద్ రోజున ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని నిర్ణయించారు. శాంతియుతంగా బంద్ నిర్వహించాలని సూచించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని, 3 రైతు చట్టాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని పేర్ని నాని కోరారు.
Also Read : త్వరలో ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు.. మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ద్వారా ఈ బంద్ పిలుపునకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ పిలుపుకు మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వం అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయం అభివృద్ధి కోసం కాదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ చీకటి చట్టాలలో వ్యవసాయ సంఘం ఆందోళనలు ఏవీ పరిష్కరించలేవని నిరసన తెలుపుతున్నారు. ఈ చట్టాలు భారతీయ వ్యవసాయాన్ని కార్పొరేటీకరణకు దారితీస్తున్నాయంటున్నారు. అందుకే చట్టాలను రద్దు చేయాలని ఏడాది నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన తెలుపుతున్నారు. లాఠీల ఝుళిపించినా వెనక్కి తగ్గడం లేదు.
Also Read: ప్రాంతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన జనసేన ! ఇక గాజు గ్లాస్ గుర్తు ఉండదా ?
తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ఏపీలో అధికార పక్షంతో పాటు టీడీపీ కూడా బంద్‌కు మద్దతు తెలిపింది. అలాగే బంద్ విజయవంతానికి కాంగ్రెస్ శ్రేణులు నడుం బిగించాయని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా మోడీ విధానాల వల్ల ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయిందని బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వమపక్ష నేతలు ప్రకటించారు. తెలంగాణలోనూ ఒక్క అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
ప్రభుత్వాలు బంద్‌కు మద్దతు ప్రకటించిండం అనూహ్యమే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మద్దతు ప్రకటించింది. బస్సులను నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలాయలు కూడా మధ్యాహ్నం నుంచి పనిచేసే అవకాశం ఉంది. ఈ కారణంగా బంద్ ఏపీలో మధ్యాహ్నం వరకూ సంపూర్ణంగా జరిగే అవకాశం ఉంది.
Also Read : నగరిలో రోజాకు పెద్దిరెడ్డి వర్గీయుల షాక్ - ఎంపీపీ పీఠాల కోసం రోడ్డున పడ్డ రాజకీయం !