TDP JANASENA : టీడీపీ - జనసేన కలిస్తే అంత లాభమా ! వచ్చే ఎన్నికల్లో పొత్తులకు స్థానిక ఫలితాలు దారి చూపాయా ?
టీడీపీ, జనసేన స్థానిక నాయకత్వాలు పొత్తులు పెట్టుకుని పోటీ చేసిన చోట్ల మంచి ఫలితాలు సాధించాయి. రాష్ట్ర స్థాయిలోనూ కలిసి పని చేయాలన్న సూచనలు ఆ రెండు పార్టీలకు అందుతున్నాయి.
మండలాధ్యక్షుల ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఎంపీపీ చైర్మన్ పీఠాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికం కైవసం చేసుకుంది. ఆ అంశంపై పెద్దగా ఎవరూ మాట్లాడటం లేదు. కానీ ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన కలిసి గెలుచుకున్న రెండు, మూడు ఎంపీపీ పీఠాలపైనే అందరూ విశ్లేషణ జరుపుతున్నారు. అయితే అది ఆ మండలాలకు సంబంధించిన విశ్లేషణ కాదు.. రాష్ట్రం మొత్తానికి సంబంధించినది. టీడీపీ - జనసేన కలిసి పోటీ చేయడం గురించి ఆ చర్చ .
స్థానికంగా పొత్తులు పెట్టుకున్న టీడీపీ, జనసేన !
జనసేన - భారతీయ జనతా పార్టీలు అధికారికంగా పొత్తుల్లో ఉన్నాయి. ఆ పార్టీలు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లోనూ కలిసి పోటీ చేశాయి. స్థానిక ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేశామని ఆ పార్టీల అగ్రనేతలు ప్రకటించారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. జనసేన పార్టీ నేతలు బీజేపీతో కలవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పలు చోట్ల తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. పంచాయతీ, మున్సిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఈ పొత్తులు పెట్టుకున్నాయి. కొన్ని చోట్ల లోపాయికారీగా.. మరి కొన్ని చోట్ల బహిరంగంగానే ఈ పొత్తులు పెట్టుకున్నారు. ఇలాంటి పొత్తులు పెట్టుకున్న చోట టీడీపీ - జనసేన కూటమి విజయం సాధించింది. తూర్పుగోదావరి జిల్లా కడియం, రాజోలు, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రెండు పార్టీల నేతలు స్థానికంగా పొత్తులు పెట్టుకుని మంచి విజయాలు నమోదు చేశారు. దీంతో రెండు పార్టీలు రాష్ట్ర స్థాయిలో కలవాలన్న సూచనలు వినిపించడం ప్రారంభించాయి.
Also Read : ఒకటే ఫోటో .. కేటీఆర్, విజయసాయిరెడ్డి ప్రచారం ! ఇంతకీ ఎవరిది ఫేక్ ?
గత అసెంబ్లీ ఎన్నికకల్లో పరస్పర విజయావకాశాలను దెబ్బతీసుకున్న టీడీపీ - జనసేన
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో విజయం సాదించింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమైంది. కానీ అంత ఘోరంగా ఓడిపోవడం వెనుక జనసేన పార్టీ చీల్చిన ఓట్లే కీలకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించిన 32 చోట్ల.. అది సాధించిన మెజారిటీ కంటే జనసేన గణనీయమైన ఓట్లు సాధించింది. అలాగే పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు. కానీ రెండు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అక్కడ టీడీపీ భారీగా ఓట్లు సాధించింది. ఇంకా కొన్ని చోట్ల మూడు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల తమ విజయావకాశాల్ని పరస్పరం ప్రభావితం చేసుకున్నాయి. ఫలితంగా రెండు పార్టీలు దెబ్బతిన్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 39 శాతనికిపైగా ఓట్లు రాగా.. జనసేనకు వచ్చిన ఓట్లు శాతం 7 వరకూ ఉంది.
Also Read : కేశినేని రాజకీయ వైరాగ్యం.. ఇక పోటీకి దూరం !
2014లో పోటీ చేయకుండా మద్దతిచ్చిన పవన్ !
2014 లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ టీడీపీ - బీజేపీకి మద్దతిచ్చారు. గెలుపు కోసం తన వంతు సాయం చేశారు. నాలుగేళ్ల పాటు ఏపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ విరుచుకుపడ్డారు. తాను గెలవకపోవచ్చు కానీ టీడీపీని ఓడించగలనంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. అన్నట్లుగానే ఆయన గెలవలేదు కానీ టీడీపీని ఓడించారని ఫలితాల్లో తేలిపోయింది. అప్పటికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చివరి క్షణంలో కూడా పవన్ కల్యాణ్‌కు కలసి పోటీ చేద్దామని బహిరంగ విజ్ఞాపనలు కూడా చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది.
Also Read : ఏపీలో దాష్టీక పాలన.. క్షేత్రస్థాయి పోరాటాలకు జనసేన సిద్ధం: పవన్ కల్యాణ్
కమ్యూనిస్టుల్ని వదిలి హఠాత్తుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ !
ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి పొత్తులు పెట్టుకున్నా పవన్ కల్యాణ్‌కు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులకు గుడ్ బై చెప్పారు. హఠాత్తుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి ఆలోచిస్తాయి. మిగతా సమయంలో ప్రజాపోరాటాలు చేసుకుంటాయి. కానీ పవన్ ఎందుకో కానీ బీజేపీతో పొత్తులోకి వెళ్లిపోయారు. అప్పట్నుంచి రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాలంటే బీజేపీతో సమన్వయం చేసుకోవాలి. బీజేపీ నేతలు సహకరించడం కష్టంగా మారింది. దీంతో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాస్త వెనుకబడింది. ఇటీవలి కాలంలోనే సొంతంగా జనసేన ఉద్యమాలు ప్రారంభించింది. బీజేపీతో సంబంధం లేకుండా రోడ్ల మీదకు వస్తోంది.
Watch Video : మా ఎన్నికల కోసం ప్యానెళ్ళు సిద్ధం.. మరి గెలుపు ఎవరి వైపు?
బీజేపీతో పొత్తుపై జనసేన నేతల్లో అసహనం - టీడీపీతో పొత్తుపై సానుకూలత !
బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీలు దూరమయ్యారని జనసేన నేత పోతిన మహేష్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత వాపోయారు. ఆ పార్టీతో పొత్తు వద్దన్న తమ అభిప్రాయాన్ని పవన్ కల్యాణ్‌కు చెబుతామన్నారు. జనసేనకు అంతో ఇంతో బలం ఉన్న చోట ఆ పార్టీ నేతల అభిప్రాయం కూడా అలాగే ఉంది. బీజేపీతో కలిసి సీట్ల సర్దుబాటు చేసుకోవడం కన్నా తాము టీడీపీ వెంట నడవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. జనసేన కలిసి రావాలే కానీ కలుపుకుని పోతామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆచంట నియోజకవర్గంలో జనసేనతో కలిసి మంచి ఫలితాలు సాధించిన టీడీపీ నేత ,మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బహిరంగంగానే తన అభిప్రాయాన్ని చెప్పారు. జనసేన- టీడీపీ కలవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా అదే చెబుతున్నారు. వారు కలిస్తే ఏపీ రాజకీయాలు మారిపోతాయని జోస్యం చెప్పారు.
Watch Video : నాన్న కల నెరవేర్చిన సివిల్స్ 20వ ర్యాంకర్ శ్రీజ..
వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పొత్తులు చిగురిస్తాయా !?
రాజకీయాల్లో సిద్ధాంతం అంటే అధికారమే. రాజకీయ పార్టీలు తమకు ఏ విధంగా రాజకీయ లాభం కలుగుతుందో అలా అడుగు వేయడం ఎప్పుడో ప్రారంభమైంది. కానీ ఎలా లాభం అనేది తేల్చుకునే దగ్గరే సమస్య వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ జనసేన పార్టీకి బలం ఎమిటో క్లారిటీ వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ పార్టీగా ఒక్కరే ఉండాలి. ఈ కోణంలో ాజకీయ పార్టీల వచ్చే ఎన్నికల వాటికి ఆలోచన చేస్తే రాజకీయంగా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఆ మార్పులకు స్థానిక సంస్థల ఎన్నికలే బాట వేశాయని చెప్పుకోవచ్చు.
Also Read : నిండు గర్భిణి ప్రాణాలు కాపాడిన దిశ యాప్..