Teacher MLC Elections: అంతన్నారింతన్నారు! చివరకు ఆయనకే జై కొట్టారు - ఎందుకిలా?
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను విజయం వరించింది. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ టీచర్స్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. పీఆర్సీ విషయంలో మోసం చేశారని, సీపీఎస్ రద్దు హామీ నిలబెట్టుకోలేదని, చివరకు తమకు రావాల్సిన బకాయిలు కూడా సకాలంలో విడుదల చేయడంలేదంటూ ఉపాధ్యాయులు ఉద్యోగులు గొడవ గొడవ చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనే వార్తలు వస్తున్నాయి. కానీ అదంతా వట్టిదేనని తేలిపోయింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను విజయం వరించింది. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ టీచర్స్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలంటే సహజంగా పీడీఎఫ్ కి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పీడీఎఫ్ అభ్యర్థులకే మద్దతిచ్చింది. అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ స్థానాలు ఎందుకు వదిలేయాలనే ఆలోచన జగన్ కి వచ్చింది. తీవ్ర తర్జన భర్జనల అనంతరం వైసీపీ తరపున అధికారికంగా అభ్యర్థులను నిలబెట్టారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోకి వచ్చే తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టారు. అప్పటికే ఆయన రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్నారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థల అధినేతగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఆయనకు మంచి పేరుంది. అదే ఇప్పుడు వైసీపీకి కలిసొచ్చింది. పీడీఎఫ్ అభ్యర్థి బాబురెడ్డిపై ఆయన గెలుపొందారు.
పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో
ఎం.వి రామచంద్రారెడ్డి వైసీపీ తరపున బరిలో దిగి.. పీడీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై 165 ఓట్లతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోవడంతో, ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 169 ఓట్ల తేడాతో ఎం.వి.రామచంద్రారెడ్డి గెలిచినట్లుగా ప్రకటించారు. ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి 10,618 ఓట్లు రాగా, ఎం.వి.రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు వచ్చాయి.
ప్రభుత్వంపై టీచర్లలో వ్యతిరేకత లేదా..?
వైసీపీ ప్రభుత్వంపై టీచర్లలో తీవ్ర వ్యతిరేకత ఉంది అనే ప్రచారం మాత్రం ఏపీలో ఉంది. దానికి తగ్గట్టే ఉద్యోగ సంఘాల నిరసనల్లో ప్రభుత్వ టీచర్లే ముందువరుసలో ఉంటారు. సీపీఎస్ రద్దుకోసం చేసిన పోరాటంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులే చురుగ్గా పాల్గొన్నారు. వేషాలు మార్చుకుని మరీ విజయవాడ వెళ్లి తమ సత్తా చాటారు. అలాంటి టీచర్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఓటుతో తమ తీర్పు ఇచ్చే సందర్భంలో వైసీపీకి అండగా నిలిచారు. అంటే ఇకపై ఉద్యమాలు చేసినా, ఆందోళనల్లో పాల్గొన్నా.. చివరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు టీచర్లు ఊ కొట్టాల్సిందేనని తేలిపోయింది. ప్రభుత్వ టీచర్ల మద్దతు కూడా తమకే ఉందని వైసీపీ నేతలు కచ్చితంగా చెప్పుకునే పరిస్థితి కనపడుతోంది.
ప్రైవేట్ టీచర్ల ఓట్లు కీలకంగా మారాయా..?
పూర్తిగా ప్రభుత్వ టీచర్లకే ఈ ఎన్నికల్లో ఓట్లు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. ఈదఫా ప్రైవేట్ టీచర్లకు కూడా ఓటు హక్కు రావడంతో ఆ ఓట్లన్నీ గుంపగుత్తగా వైసీపీకే పడ్డాయని అంటున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలన్నిటితో.. ఆయా అభ్యర్థులకు సత్సంబంధాలు ఉండటం, ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలతో వైసీపీ అభ్యర్థులు 6నెలల ముందునుంచీ వ్యూహ రచన చేయడంతో వారికి విజయం సునాయాసంగా దక్కింది. మెజార్టీ సంగతి పక్కనపెడితే.. పీడీఎఫ్ అభ్యర్థులకు ఆనవాయితీగా వస్తున్న విజయాన్ని వైసీపీ కొల్లగొట్టింది. టీచర్ ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ వ్యూహం పక్కాగా ఫలించింది.