Ganta Srinivas Rao: 'బొత్స'గారూ డీఎస్సీపై గుడ్ న్యూస్ ఎక్కడ.? - ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే గంటా ప్రశ్న
నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎక్కడ.? అంటూ మంత్రి బొత్సను నిలదీశారు.
ప్రతిపక్ష నేతగా హామీల వర్షం కురిపించిన జగన్, సీఎం అయ్యాక 4 ఏళ్లు దాటినా వాటిని నెరవేర్చలేదని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది మెగా డీఎస్సీ, జనవరి 1న జాబ్ క్యాలెండర్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో 2, 3 రోజుల్లో 'డీఎస్సీపై గుడ్ న్యూస్' అని మంత్రి బొత్స చెప్పారని గుర్తు చేశారు. 'ఆ 2, 3 రోజులు గడిచిపోయాయని మరి గుడ్ న్యూస్ ఎక్కడ.?' అంటూ ట్విట్టర్ వేదికగా గంటా నిలదీశారు.
డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు.?
'డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు.? టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు.? రాత పరీక్ష ఎప్పుడు.? అసలు ఎన్నికలు పూర్తయ్యే సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారా.?' అంటూ గంటా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల వేళ హడావిడిగా నిర్ణయాలు తీసుకుని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. 'నిరుద్యోగులను ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారని.?' నిలదీశారు. కనీసం 1998, 2008లో డీఎస్సీలో ఎంపికైన కాంట్రాక్టు ఉద్యోగులనైనా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞుప్తి చేస్తున్నట్లు చెప్పారు.
'2024లో టీడీపీదే అధికారం'
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 9,061 పోస్టులతో, 2018లో 7,729 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించామని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. 2024లో టీడీపీదే అధికారమని, నిరుద్యోగుల భవిష్యత్తుకు ఏం ఢోకా లేదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో బ్యాకలాగ్ పోస్టులు భర్తీ చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
మంత్రి బొత్స ప్రకటన ఇదే
కాగా, రాష్ట్రంలోని విద్యా శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ప్రకటించారు. యూనివర్శిటీలు, ఐఐటీల్లో ఖాళీగా ఉన్న 3,200కు పైగా పోస్టులను కొద్ది రోజుల్లోనే భర్తీ చేస్తామని చెప్పారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లల్లో ఉద్యోగ ఖాళీలను గుర్తించామని మంత్రి బొత్స తెలిపారు. కొద్ది రోజుల్లోనే డీఎస్సీపై స్పష్టత వస్తుందని చెప్పారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తామని బొత్స తెలిపారు.