Tarakratna Health Update : తారకరత్నకు తీవ్ర గుండెపోటు - యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు ! ప్రాణాపాయం లేదన్న టీడీపీ నేతలు
తారకరత్నకు ప్రాణాపాయం లేదని టీడీపీ నేతలు ప్రకటించారు. వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
![Tarakratna Health Update : తారకరత్నకు తీవ్ర గుండెపోటు - యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు ! ప్రాణాపాయం లేదన్న టీడీపీ నేతలు TDP leaders announced that Tarakaratna was not life threatening. Tarakratna Health Update : తారకరత్నకు తీవ్ర గుండెపోటు - యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు ! ప్రాణాపాయం లేదన్న టీడీపీ నేతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/27/013d602efc1ddeb915f3ce53cd54f8811674811117895228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tarakratna Health Update : తారకరత్నకు తీవ్ర గుండెపోటు రావడంతోనే కుప్పకూలిపోయారని టీడీపీ నేతలు ప్రకటించారు. వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేశారని.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని టీడీపీ నేతలు చెప్పారు. పాదయాత్రలో ఉన్న సమయంలో మాసివ్ స్ట్రోక్ రావడంతో పడిపోయారని.. వాలంటీర్లు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. అక్కడ పీసీఆర్ చేసిన తర్వాత... మెరుగైన వైద్యం కోసం.. పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వెంటనే... యాంజియోగ్రామ్ చేశారని ఆరోగ్యం నిలకడగా ఉందని.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.
తారకరత్నకు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిన వెంటనే నందమూరి బాలకృష్ణ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడారు. చికిత్స కొనసాగుతున్నంత సేపు ఆస్పత్రిలోనే ఉన్నారు. కుటుంబసభ్యుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు.. తారకరత్న ఆరోగ్య సమాచారం అందించారు. చంద్రబాబు కూడా.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుప్పం పీఈసీ మెడికల్ కాలేజీ వైద్యులతో మాట్లాడారు. అత్యవసరం అయితే బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
తారకరత్నను మొదట కేసీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి ఆయన శరీరం బ్లూ కలర్‌లోకి మారింది. పల్స్ కూడా లేదు. దీంతో కేసీ ఆస్పత్రి వైద్యులు అత్యవసరం పీసీఆర్ నిర్వహించారు. దాదాపుగా నలభై ఐదు నిమిషాల తర్వాత తారకరత్నకు మళ్లీ పల్స్ వచ్చింది. గుండెపోటు లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో వెంటనే.. మరిన్ని మెరుగైన వసతులు ఉన్న ఆస్పత్రికి తరలించారు. యాంజియో ప్లాస్టీ చేసి స్టెంట్ వేసిన తర్వాత ... ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని వైద్యులు టీడీపీ నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫోన్ చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి బాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణతో ఫోన్‍లో మాట్లాడిన తారకరత్న భార్య..ఇతర కుటుంబసభ్యులు మాట్లాడారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబసభ్యులకు బాలకృష్ణ వివరించారు. యాంజియోప్లాస్టీ చేసి గుండె నాళాల్లో బ్లాక్స్ తొలగించి స్టెంట్ వేసినందున ఇక .. అత్యవసర వైద్యం కోసం బెంగళూరు తరలించాల్సిన అవసరం కూడా లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
తారకరత్న ఇటీవల రాజకీయంగానూ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా సార్లు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాననే ప్రకటనలు చేయలేదు. కానీ ఇటీవల రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేయాలని అనుకుంటున్నారు. తరచుగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో పర్యటించినప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో లోకేష్ తో కూడా సమావేశం అయ్యారు. కుప్పం వచ్చే ముందు బాలకృష్ణతో కలిసి హిందూపురం నియోజకవర్గంలోనూ పర్యటించారు. వరుసగా తీరిక లేకుండా.. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో .. తారకరత్న అస్వస్థతకు గురయినట్లుగా తెలుస్తోంది.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు చికిత్స పూర్తయిన తర్వాత అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. టీడీపీ నేతలు వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)