Srikakulam News : సీఎం సభలో విషాదం, గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి!
Srikakulam News : సీఎం జగన్ సభలో ఘోర విషాదం జరిగింది. విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు.
Srikakulam News : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటనలో విషాదం జరిగింది. సీఎం సభకు విధులు నిర్వహించేందుకు వచ్చిన అనకాపల్లి హెడ్ కానిస్టేబుల్ అప్పారావు గుండెపోటుతో మృతిచెందారు. విధుల్లో ఉన్న ఆయన.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కానిస్టేబుల్ ను గమనించిన తోటి పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హెడ్ కానిస్టేబుల్ అప్పారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడు అప్పారావు మరి కొద్దిరోజుల్లో ఏఎస్సైగా ప్రోమోట్ అవుతున్నట్లు తోటి పోలీస్ సిబ్బంది తెలియజేస్తున్నారు.
నల్ల చున్నీలు ధరించడంపై పోలీసులు అభ్యంతరం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన సీఎం సభలో మహిళలు నల్ల చున్నీ ధరించడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఈ ఘటనపై విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన మహిళా నేతలు ఆందోళన చేశారు. నల్ల చున్నీలు, నల్ల చీరలు ధరించి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు మహిళలతో వ్యవహరించిన తీరుసరికాదన్నారు. మహిళలకు వారు ఏ దుస్తులు వేసుకోవాలనే హక్కు ఉందన్నారు. ఈ అంశంపై మహిళా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జనసేన మహిళలకు అండగా ఉంటుందన్నారు.
భద్రాద్రి జిల్లాలో విషాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం విషాదం జరిగింది. ఓ ప్రభుత్వ అధికారి గ్రామస్థుల ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పోడు భూముల వివాదం నేపథ్యంలో వలస గొత్తికోయలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను గుత్తికోయలు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే మొక్కలను నరకవద్దని గుత్తికోయలను హెచ్చరించడంతో గుత్తికోయలు ఆగ్రహం చెందారు. వారు సహనం కోల్పోయి ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్ రేంజ్ అధికారి తీవ్ర గాయాల పాలు అయ్యారు. వెంటనే తోటి సిబ్బంది ఆయన్ను చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు చేసిన దాడిలో గిరిజనులకు గాయాలైనప్పటికీ తొలిసారిగా గుత్తికోయలు దాడి చేయడం, ఈ దాడిలో రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. గుత్తికోయలు చేసిన దాడిపై అప్రమత్తమైన పోలీసు అధికారులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.
ప్రాణం కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
బంజారాహిల్స్‌లో విద్యు్త్ షాక్ కు గురై కింద పడిన వ్యక్తిని అక్కడే విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. విద్యుదాఘాతం కారణంగా కిందపడి కొట్టుకున్న వ్యక్తి షాక్‌తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ విషయం గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ హుటాహుటిన ఆ వ్యక్తి వద్దకు చేరుకుని అతడి ఛాతిపై రెండు చేతులు పెట్టి బలంగా నొక్కి అతడి శ్వాస సాధారణ స్థాయికి వచ్చేంతవరకు సపర్యలు చేశారు. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. విద్యుదాఘతం నుంచి ఒక వ్యక్తిని కాపాడి అతడి ప్రాణాలు నిలబెట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలును ఉన్నతాధికారులు అభినందించారు.