Crime News: నంద్యాల జిల్లాలో దారుణాలు - డబ్బుల కోసం విద్యార్థుల బట్టలు విప్పి దాడి, మరో చోట పాత కక్షలతో వృద్ధుని హత్య
Nandyal News: నంద్యాల జిల్లాలో దారుణాలు జరిగాయి. కొందరు దుండగులు ఇద్దరు విద్యార్థులపై డబ్బుల కోసం విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అటు, మహానంది మండలంలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.
Attacked On Students In Nandyal District: నంద్యాల జిల్లాలో (Nandyal District) దారుణాలు చోటు చేసుకున్నాయి. కొందరు దుండగులు డబ్బుల కోసం ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పి నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మరో చోట పాతకక్షలతో వృద్ధున్ని దారుణంగా హతమార్చారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1న ఎస్‌డీఆర్ పాఠశాల ఛైర్మన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వస్తోన్న ఓ ఇంటర్ విద్యార్థిపై.. సుబ్బయ్య, శంకర్, మరి కొంతమంది ఆకతాయిలు అడ్డగించి డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద లేవని చెప్పగా విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో బాలుడు తనకు తెలిసిన బీటెక్ విద్యార్థి లోకేశ్వరరెడ్డికి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. అతను అక్కడికి రాగా అతనిపైనా దాడికి పాల్పడ్డారు. లోకేశ్వరరెడ్డి దుస్తులు విప్పి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. అతని ఛాతీపై కూర్చుని తీవ్రంగా దాడి చేశారు.
చెవి కొరికేశారు
అనంతరం లోకేశ్వరరెడ్డి చెవి కొరికి తీవ్రంగా గాయపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, దాడి జరిగిన రోజు నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు వాపోయారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, పాఠశాల సమీపంలోనే ఈ దాడి జరగ్గా.. స్కూల్ యాజమాన్యమే కేసు నమోదు చేయకుండా అడ్డుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. నిందితులు సుబ్బయ్య, శంకర్, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు నంద్యాల గ్రామీణ పోలీసులు తెలిపారు.
పాత కక్షలతో వృద్ధుని హత్య
అటు, మహానంది మండలంలోని సీతారామపురం గ్రామంలో పాతకక్షలతో ఓ వృద్ధున్ని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పసుపులేటి సుబ్బారాయుడు (68) అలియాస్ పెద్దన్న అనే వ్యక్తి ఇంటిపై శనివారం అర్ధరాత్రి దాదాపు 38 మంది దాడి చేసి కర్రలు, ఇనుప రాడ్లతో పెద్దన్నను కొట్టారు. అతని భార్య కళ్ల ముందే బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పసుపులేటి సుబ్బారాయుడు, జయనారపురెడ్డి పని చేసేవారు. ఏ పార్టీ మారాల్సి వచ్చినా ముగ్గురూ కలిసే మారేవారు. వీరు చెప్పిన పార్టీకే గ్రామస్థుల్లో అధిక శాతం ఓట్లేసేవారు. అయితే, ముగ్గురి మధ్య మూడేళ్ల కిందట ఆర్థిక విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో రెండు వర్గాలుగా చీలగా.. ఓటర్లు కూడా అలానే చీలిపోయారు.
మొన్నటి ఎన్నికల ముందు శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో మెజార్టీ రాకపోవడం.. సుబ్బరాయుడు, జయనారపురెడ్డి తన వెంట రాకపోవడం వల్లే హవా తగ్గిందనే శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పాటే ఆర్థిక విభేదాలు, పాత కక్షలతో శ్రీనివాసరెడ్డి వర్గీయులు.. సుబ్బరాయుడు ఇంటిపై దాడి చేసి అతన్ని దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నంద్యాల ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా, ఏఎస్పీ ప్రవీణ్ కుమార్, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు గ్రామంలో పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.