Three Capitals Tirupati : మూడు రాజధానులు కావాలి.. తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ర్యాలీ !
మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ర్యాలీ నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్న నినాదంతో భూములు ఇచ్చిన రైతులు పాదయాత్రగా తిరుపతి చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని శుక్రవారం బహిరంగసభ నిర్వహించబోతున్నారు. అంతకంటే ముందే రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలోపెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. మూడు రాజధానులు కావాలని విద్యార్థుల నినాదాలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని రాయలసీమ మేధావుల ఫోరమ్ ప్రకటించింది. తిరుపతిలోని కృష్ణాపురం ఠాణా దగ్గర నుంచి .. కార్పొరేషన్ కార్యాలయం వరకూ ప్రదర్శన జరిగింది.
అమరావతి రైతులు తిరుపతిలోకి ప్రవేశించే ముందే కొన్ని ఫ్లెక్సీలు కలకలం రేపాయి. తాము మూడు రాజధానులకు మద్దతుగా ఉన్నామని తిరుపతి ప్రజల పేరుతో ఫ్లెక్సీలు వేశారు. అయితే అవి వైఎస్ఆర్‌సీపీ నేతలే వేశారని అమరావతి రైతులు ఆరోపించారు. అమరావతి రైతుల పాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుండి రాయలసీమ మేధావుల ఫోరం పలు అంశాలను లెవనెత్తి పోటీ కార్యక్రమాలు చేస్తోంది. అందులో భాగంగా అమరావతి రైతులు బహిరంగసభ నిర్వహించాలనుకున్న శుక్రవారం రోజునే తాము కూడా సభ నిర్వహిస్తామని దరఖాస్తు పెట్టుకుంది.
రెండు వర్గాలు ఒకేసారి సభలు పెట్టుకుంటామని అడగడంతో పోలీసులు ఇరువురికి నో చెప్పారు. అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. రాయలసీమ మేధావుల ఫోరం కూడా పిటిషన్ వేశారు. ఇరువురి పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు పదిహేడో తేదీన అమరావతి రైతులు తిరుపతిలో సభ నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. రాయలసీమ మేధావుల ఫోరం పద్దెనిమిదో తేదీన సభ నిర్వహించుకోవాలని సూచించింది. ఎవరూ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని స్పష్టం చేసిది.
ఈ క్రమంలో తిరుపతిలో బహిరంగసభ ఏర్పాటుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరవనున్నారు. దీంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి