AP PRC Jagan : పీఆర్సీపై చిక్కుముడి... పట్టు వీడని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ! తదుపరి వ్యూహంపై సీఎంతో సజ్జల , బుగ్గన చర్చలు !
AP PRC Jagan : పీఆర్సీపై వీడని చిక్కుముడి... పట్టు వీడని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ! తదుపరి వ్యూహంపై సీఎంతో సజ్జల , బుగ్గన చర్చలు !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఫిట్‌మెంట్ ఇతర ప్రయోజనాలపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది. ఉద్యోగ సంఘాలతో బుధవారం ఆరు గంటలకుపైగా చర్చలు జరిపిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి జగన్‌కు నివేదించారు. దాదాపుగా రెండు గంటల పాటు జగన్‌తో వీరిద్దరూ సమావేశమయ్యారు. వీరితో పాటు ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. చర్చలు ఉద్యోగులు పెట్టిన ప్రధానమైన డిమాండ్లు... వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై బుగ్గన, సజ్జల ముఖ్యమంత్రికి కొన్ని ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తోంది.
కార్యదర్శుల కమిటీ నివేదిక సమర్పించిన చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫిట్‌మెంట్. మానిటరీ బెనిఫఇట్స్ అమలు తేదీ వంటి వాటిపై ఉద్యోగుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఉద్యోగ సంఘాలతో ఇంకా చర్చలు కొనసాగించాల్సి ఉన్నందున ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి.. ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇలా మొత్తం ఉద్యోగులకు వివరించి ప్రభుత్వ ప్రతిపాదనలకు వారు అంగీకరించేలా చూడాలని సీఎం జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసిన పీఆర్సీకి తాము అంగీకరించే ప్రశ్నే లేదని ఉద్యోగసంఘాలు చెబుతున్నాయి. కనీసం 34 శాతం ఫిట్‌మెంట్ కోరుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫిట్‌మెంట్ అంశంపైనే పీటముడి పడింది. ఫిట్‌మెంట్ కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసినంతనే నిర్ణయించినా జీతం తగ్గబోదని ప్రభుత్వం ఉద్యోగులకు హామీ ఇస్తోంది. కానీ తగ్గించబోమని చెప్పడం ఏమిటని.. పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం జరగాల్సి ఉంది.
Also Read: CPS Cancellation: సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల ఆశలు ఆవిరి.. చేతులెత్తేసిన ప్రభుత్వం!
అయితే మంత్రులతో జరిగిన చర్చల్లో వారు ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపిన తర్వాతే ఆ సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఉద్యోగ సంఘాలతో ఇంకా సీఎం జగన్ సమావేశం ఖరారు కాలేదు. మొత్తంగా చూస్తే పీఆర్సీ అంశంలో అటు ప్రభుత్వం ఆర్థిక కారణాల వల్ల ఎక్కువ ఇవ్వలేమని చెబుతోంది.. కానీ ఇచ్చి తీరాలని ఇటు ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఎవరైనా వెనక్కి తగ్గితేనే సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే ఇలా నానుతూనే ఉంటుంది.
Also Read: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి