Kapu Garjana cases : ఆ రెండు కేసులు మినహా కాపు గర్జన కేసులన్నీ ఎత్తేసిన రైల్వే శాఖ
కాపు గర్జన కేసులు ఎత్తేసిన రైల్వే శాఖ..అయితే ఆ రెండు కేసులు ఎత్తేయమని.. మాత్రం ఎపీ సర్కార్ కోరలేదన్న కేంద్ర రైల్వే మంత్రి.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి కాపు గర్జన రైల్వే ఆస్తుల దహనం కేసులో కేంద్రం కీలక ప్రకటన చేసింది. రైల్వే ఆస్తుల ధ్వంసంపై నమోదైన ఐదు కేసులను ఎత్తేశామవని స్పష్టం చేసింది. మరో రెండు కేసులుపై ఏపీ సర్కారు లిఖిత పూర్వకంగా స్పష్టత ఇవ్వకపోవటంతో అవి ఇంకా కొనసాగుతున్నాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వెల్లడించారు.
2016లో సంఘటన
కాపు నేతలపై కేసుల ఉపసంహరణపై బీజేపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు వేసిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. 2016లో తూర్పుగోదావరి జిల్లాలో తునిలో జరిగిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌పై హింస, విధ్వంస ఘటనల్లో కాపుగర్జన నేతలపై కేసులు నమోదయ్యాయి. పార్లమెంట్‌లో బిజెపి ఎంపి జీవీఎల్ ఈ కేసులు, వాటి స్థితిగతులు, ముగింపు కాకపోవడానికి కారణాలను రైల్వే మంత్రిని అడిగారు. రైల్వే మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పూర్తి వివరాలు అందజేశారు.
ఐదు కేసులు ఉపసంహరణ
కాపు గర్జన టైంలో నేతలపై రైల్వే శాఖ పెట్టిన ఐదు కేసులను ఉపసంహరించుకున్నట్లు రైల్వేశాఖ మంత్రి తెలిపారు. రైల్వే శాఖ వేసిన మరో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP), తుని బేరింగ్ నంబర్ 17/2016 దాఖలు చేసిన కేసు రాజమండ్రిలోని CBCIDలో విచారణలో ఉంది. 1.02.2016 నాటి మరో కేసు నం. 77/2016 విజయవాడలోని రైల్వే అదనపు మేజిస్ట్రేట్ VIIలో విచారణ దశలో ఉందని మంత్రి వివరించారు.
రెండు కేసులు పెండింగ్
ఈ విషయంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ రైల్వే పోలీసులు నమోదు చేసిన ఐదు కేసులను ఉపసంహరించుకున్నందుకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు రైల్వే మంత్రికి లేఖ రాశారు. రైల్వేలో పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను ఉపసంహరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదని రాలేదని మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావించారు. రైల్వే మంత్రిత్వ శాఖతో సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అంతే కాదు మిగిలిన రెండు కేసులను ఉపసహరించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రైల్వే మంత్రికి జీవీఎల్ లేఖ రాశారు.
ఆ రెండూ ఉపసంహరించుకోవాలన్న జీవీఎల్
రైల్వే ఆస్తులకు నష్టం, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టడం కాపుగర్జన మహాసభ నాయకులు, సభ్యులు చేసినవి కావని, నేరస్థుల చర్యలే కారణమని జీవిఎల్ తన లేఖలో పేర్కొన్నారు. జరిగే ఆందోళనకు దాని నాయకులకు చెడ్డ పేరు తేవడానికి చేసిన చర్యలేనని అభిప్రాయపడ్డారు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలుసని అన్నారు. ఈ కేసుల్లో వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న కాపు నేతలు గత ఆరేళ్లలో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని వెల్లడించారు. కేసు నెం.17/2016, 77/2016లను ఉపసంహరించుకోవాలని లేదా అవసరమైతే ట్రయల్ కోర్టులో మూసివేత నివేదికను దాఖలు చేయాలన్నారు. శాంతియుత ఆందోళనలకు నాయకత్వం వహించిన కాపు నాయకులకు ఉపశమనం కలిగించాలని జీవీఎల్ నరసింహారావు తన లేఖలో కేంద్ర రైల్వే మంత్రిని కోరారు.