Weather Alert: ఏపీలో మూడు రోజులు.. తెలంగాణలో ఇంకో రెండు రోజులు వానలే వానలు..
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లోనూ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ రెండు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో అల్పపీడన ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ అల్పపీడనం మరో రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశ వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ కారణంగా ఏపీలో రాబోయే మూడు రోజుల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు..
తెలంగాణను వర్షాలు వదలడం లేదు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. పలు ప్రాంతాల తడిసి ముద్దయ్యాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నెల 11న ఉత్తర, పరిసర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈరోజు దక్షిణ ఛత్తీస్ గఢ్ పరిసరాలు, దక్షిణ ఒడిశా ప్రాంతాలలో కేంద్రీకృతం అయిందని ఐఎండీ సంచాలకులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. నదులు, వాగులు, వంకలు ఉద్రుతంగా ప్రవహిస్తున్నాయి. ఇంకొన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
Also Read: AP EAPCET Result 2021 Live Updates: నేడే ఈఏపీసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా..