Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలే.. వానలు.. మరో రెండు రోజులు కూడా.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిస్తాయని వాతవారణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో భారీగా వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతవరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. యానాంతో పాటు కోస్తాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున హెచ్చరించారు. ఈ సమయంలో మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. భారీ వర్షాలకు ఏమైనా సమస్యలు ఏర్పడితే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు ఫోన్ చెయ్యాలని చెప్పారు.
విశాఖ కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ – 1800-425-00002, 0891-2590100, 0891-2590102
సబ్ కలెక్టర్, పాడేరు - 08935- 250228
ఆర్ .డి.ఓ.విశాఖపట్నం - 0891- 2562977
ఆర్.డి.ఓ. అనకాపల్లి - 08924- 223316
ఆర్.డి.ఓ. నర్సీపట్నం - 08932 -226433
తెలంగాణ రాష్ట్రంలో 16 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది. అవసరమైతే తప్ప ప్రజలెవరు ఇళ్ల నుండి బయటకు రావొద్దని అధికారులు కోరారు.
ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి,రంగారెడ్డి, మేడ్చల్,వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. మూసీ పరివాహక ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.
బంగాళాఖాతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. తెలంగాణ పక్కనే ఉన్న మరఠ్వాడా పై 4.5 కి.మీ ఎత్తున గాలులతో మరో ఉపరితల ఆవర్తనం ఉంది. రుతుపవనాల గాలుల ద్రోణితో ఢిల్లీ బాలంగీర్, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు వ్యాపించింది. దీంతో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా-ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీని మీదుగా రుతుపవన ద్రోణి, అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రమంతా ముసురుపట్టి ఉంది. చాలాచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.