Pulichintala Project Dam Gates: వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన పులిచింతల క్రస్ట్ గేట్... భారీగా నీరు వృథా... అధికారులు అలర్ట్
ఏపీలోని పులిచింతల డ్యామ్ గేటు విరిగి పడిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి 16వ నెంబర్ గేటు కొట్టుకుపోయిందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపోయింది. వరద ఉద్ధృతికి గేటు కొట్టుకుపోవడంతో భారీగా నీరు వృధా అవుతోంది. వరద నీటి ప్రవాహానికి 16వ నెంబర్ గేటు విరిగిపడిపోయింది. గురువారం తెల్లవారు జామున సుమారు గం.3.20 నిముషాలకు ప్రాజెక్టులో ఇన్ ఫ్లో అధికంగా ఉండడంతో అధికారులు కొంతమేర గేట్లు పైకి ఎత్తారు. గేట్లు ఎత్తే క్రమంలో మెకానికల్ తప్పిదంతో గేటు ఊడిపోయింది. దీంతో రంగంలోకి దిగిన ఇంజనీరింగ్ సిబ్బంది తక్షణ చర్యలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న నీరుపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రాజెక్టును పరిశీలించారు. అధికారులు పరిస్థితిని మంత్రికి తెలియజేశారు. తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. 16వ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అందుకోసం ప్రాజెక్టులోని నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతి ఇతర గేట్లపై పడే అవకాశం ఉందని, ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో వరద చేరుతుందని తెలిపారు. నదిపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు. వాగులు, వంకలు, కాలువలు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరద ఉద్ధృతి అధికంగా ఉండడం వలన ఎవరు నదిలోకి వెళ్లవద్దని సూచించారు.
Also Read: INS Vikrant: హిందూ మహాసముద్రంపై విక్రాంత్ రైడ్... తిరుగులేని శక్తిగా భారత్...
పులిచింతల ప్రాజెక్టులో వరద పోటెత్తడంతో గేటు విరిగిపోయింది. గురువారం వేకువజామున ఇన్ ఫ్లో అధికంగా ఉండటంతో అధికారులు కొంతమేర గేట్లు పైకి ఎత్తారు. గేట్లు ఎత్తే క్రమంలో గాటర్స్‌లో మెకానికల్ తప్పిదంతో గేటు విరిగిపడిపోయిందని అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ సిబ్బంది తక్షణమే స్పందించి ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటుకు ప్రయత్నించినప్పటికీ వరద ప్రవాహం తీవ్రంగా ఉండడం వలన అది సాధ్యపడలేదు. అధికారులు 16వ గేటు సహా 11,13,14,18,19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గేటు విరిపోగిపోవడంతో డ్యామ్ మీదుగా రాకపోకలను నిలిపివేశారు.
పులిచింతల ప్రాజెక్టుకు వరద ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 44.53 టీఎంసీలకు చేరింది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు, ప్రస్తుతం 174.14 అడుగులకు చేరింది. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. దీంతో ప్రకాశం బ్యారెేజ్ కు వరద నీరు భారీగా చేరుతుంది.
Also Read: Andhra Pradesh: కొత్త విద్యావిధానంలో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు