Pawan Kalyan: ఏజెన్సీ మారితే ఉపాధి పోవాలా?... అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని విధులకు దూరం చేయడం సరికాదు... పవన్ కల్యాణ్ కామెంట్స్
కొత్త ఏజెన్సీ కోసం ఉన్న ఉద్యోగులను విధులకు దూరం చేయడం సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. 1700 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను బాధ్యతల నుంచి దూరం చేయడం బాధాకరమన్నారు.
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 1700 మంది ఉద్యోగులను బాధ్యతల నుంచి దూరం చేయడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏళ్ల తరబడి ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్టులుగా పనిచేస్తున్న వారిని రోడ్డున పడేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. యూపీహెచ్‌సీ అవుట్ సోర్సింగ్ ప్రతినిధులు తమ ఆవేదనను జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేద రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న వారిని దూరం పెట్టడాన్ని ఆయన ఖండించారు. కరోనా మొదటి దశ, రెండో దశ ఉద్ధృతంగా ఉన్న సమయంలో యూపీహెచ్‌సీలో వీరంతా ఎంతో ధైర్యంగా సేవలు అందించారన్నారు.
యు.పి.హెచ్.సి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని విధులకు దూరం చేయడం భావ్యం కాదు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/rzh77UJx0c
— JanaSena Party (@JanaSenaParty) October 10, 2021
Also Read: ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు.. అధికారికంగా ప్రకటించిన న్యాయ మంత్రి !
చిరుద్యోగులకు జనసేన బాసట
ఎన్నో కష్టాలు ఎదుర్కొని సేవలందించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను బాధ్యతల నుంచి దూరం పెట్టడం సరికాదన్నారు పవన్. పరీక్షల నుంచి టీకాల వరకు ఎన్నో కీలక విధుల్లో పనిచేశారని అందుకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి ఉద్యోగ భద్రత లేకుండా చేయడం భావ్యం కాదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పునరాలోచన చేసి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పవన్ కోరారు. అవుట్ సోర్సింగ్ విధానంలో మరో ఏజెన్సీని తీసుకున్నామని పాతవారికి పనిలేదని చెప్పడంలో అర్థం లేదని పవన్ అన్నారు. 'ఏజెన్సీ మారితే ఉపాధి పోవాలా? కొత్త ఏజెన్సీ కోసం ఉన్న ఉద్యోగులను బలి చేస్తారా? లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడున్న ఉద్యోగుల సేవల్ని నిలిపివేయడం ఏమిటి?' అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. యూపీహెచ్‌సీల్లో అనుభవం ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్నారు. వారిని విధుల్లో కొనసాగించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. చిరుద్యోగులకు జనసేన పార్టీ బాసటగా నిలుస్తుందన్నారు.