National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్
National Handloom Day: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ అండగా ఉంటానని, పవన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని అన్నారు.
National Handloom Day: జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. నూలు దారాలతో కళాఖండాలు సృష్టించి యావత్ ప్రపంచాన్ని అబ్బుర పరిచిన చరిత్ర మన చేనేత కార్మికులదని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
స్వాతంత్రోద్యమంలో వారిదే ముఖ్య భూమిక : జగన్
స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో భారతీయులు అందరినీ పోరాటంలో పాలు పంచుకునేలా ప్రోత్సహించడంలో చేనేత కార్మికులు ముఖ్య పాత్ర పోషించారని సీఎం తెలిపారు. చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జాతీయ చేనేత కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన సీఎం.. చేనేతల సంక్షేమం కోసం నేతన్న హస్తం అనే పథకాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వైఎస్సార్ నేతన్న హస్తం ద్వారా అర్హులకు ఏటా రూ.24 వేలు ఇస్తూ వారికి అండగా ఉంటున్నట్లు వెల్లడించారు. ఆ పథకం ద్వారా చేనేత కార్మికుల్లో ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు.
నేత కార్మికులకు కళాభివందనాలు: పవన్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియ జేశారు. నేతన్నలకు కళాభివందనాలు తెలుపుతున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. చేనేత కళాకారుల కోసం ప్రత్యేకంగా జాతీయ దినోత్సవం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కళను నమ్మిన వారు అర్ధాకలితో జీవిస్తుండటం దురదృష్టకరమని పవన్ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కసారి అయినా చేనేత వస్త్రాలు ధరించాలని పవన్ కోరారు. చేనేత వస్త్రాలు ధరించినప్పుడు కలిగే నిడారంబరత, లాలిత్యం, ప్రశాంతత మనసును హత్తుకుంటుందని పవరన్ తెలిపారు. కళారంగంపై లోతైన అధ్యయనం జరగాలని పవన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కళాకారులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జీవితాంతం బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా..
భారతీయ కళలు ప్రపంచంలో ఎంతటి విశిష్ట స్థానాన్ని పొందాయో ప్రతి ఒక్కరికి తెలుసుని జనసేనాని పేర్కొన్నారు. అటు వంటి కళల్లో వారసత్వంగా చేనేత కళారంగం విరాజిల్లుతోందని తెలిపారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో చేనేత కూడా ఒక అహింసాయుత ఆయుధంగా ఉపయోగపడిందని పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు. నేత కార్మికుల జీవితం మెరుగు పడాలని, అంత వరకు ప్రభుత్వాలు ప్రత్యకంగా, పరోక్షంగా అండగా నిలవాలని అభిప్రాయపడ్డారు. చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా నిలవాలని తెలిపారు. గొప్ప సుగుణాలు ఉన్న చేనేతకు తన జీవితాంతం బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడతానని పునరుద్ఘాటించారు. తాను అంబాసిడర్ గా ఉండటం వల్ల చేనేత కళాఖండాలకు ప్రచారం జరుగుతుందని తెలిపారు. దాని వల్ల నేతన్నల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ జరుగుతుందని అన్నారు. దాని వల్ల చేనేత కార్మికుల జీవితాల్లో ఆర్థిక పుష్టి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేతన్నలు ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఆ మంచి పరిస్థితి వచ్చేంత వరకు తాను విశ్రమించబోనని తెలిపారు జనసేనాని.