Panchakarla Ramesh Babu : జనసేనలోకి పంచకర్ల రమేష్ బాబు - పెందుర్తి నుంచే పోటీకి రెడీ !
జనసేన పార్టీలో చేరాలని పంచకర్ల రమేష్ బాబు నిర్ణయించుకున్నారు. 17వ తేదీన ఆయన పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉంది.
Panchakarla Ramesh Babu : వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. జులై 17న రమేష్ బాబు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.రెండు రోజుల క్రితం జిల్లా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణమాలకు మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నో ఆశయాలు, ఆశలతో రాజకీయాల్లోకి వచ్చానని అవి చేసే పరిస్థితి లేనపుడు పదవిలో కొనసాగడం సరికాదని భావించి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
రాజీనామా తర్వాత పెందుర్తిలో ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఏ పార్టీలో చేరేది నేరుగా ప్రకటించలేదు కానీ.. తాను ఏ పార్టీలో చేరబోతున్నానన్నది మీ అందరికీ తెలుసని.. పెందుర్తి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తనకు సీటు హామీ ఇవ్వకపోవడంతో పంచకర్ల రమేష్ బాబు అసంతృప్తికి గురయ్యారు.
విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ రాజీనామా పై వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పంచకర్ల రమేష్ రాజీనామా తొందరపాటు చర్యగా పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే నాతో చర్చించి ఉంటే బాగుండేదని.. రమేష్ నాతో చర్చించిన సమస్యలన్నింటికీ పరిష్కారం చూపానని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ని కలిసే అవకాశం రాలేదనడం కూడా అబద్ధమేనని.. సీఎం విశాఖ వచ్చిన ప్రతిసారీ రమేష్ ముఖ్యమంత్రిని కలిసేలా అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాననన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన రమేష్ కు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించామని.. కానీ రమేష్ దానిని నిలుపుకోలేదని ఆరోపిచారు. మరో వారం రోజుల్లో అందరితో చర్చించి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
ఉత్తరాంధ్రకు మొదట విజయసాయిరెడ్డి ఇంచార్జ్ గా ఉండేవారు. తర్వాత ఆయనను తప్పించి సుబ్బారెడ్డిని నియమించారు. అప్పట్లో నియమించిన వారిని వైవీ సుబ్బారెడ్డి పట్టించుకోవడం లేదని.. సొంతంగా తనకు మద్దతుదారులుగా ఉంటున్న ఎమ్మెల్యేలకు టిక్కెట్ కరారు చేస్తున్నారని అంటున్నారు. ఆయన తీరుపై మరికొంత మంది నేతలు అసంతృప్తిగా ఉంటున్నారు.
పంచకర్ల ప్రజారాజ్యం నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మొదట ప్రజారాజ్యం తరపునే గెలిచారు. ఇప్పుడు మళ్లీ జనసేన పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.