Budevl : బద్వేలు ఉపఎన్నిక ఏకగ్రీవం లేనట్లే ! కాంగ్రెస్ ఆభ్యర్థిగా ఆమె..
బద్వేలు ఉపఎన్నిక ఏకగ్రీవం లేనట్లే. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ కూడా ఏ క్షణమైనా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉపఎన్నికల్లో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఇతర పార్టీలు డైలమాలో పడ్డాయి. అయితే తాము పోటీ చేసి తీరుతామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే కమలమ్మను కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. ఏ క్షణమైనా బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. మిత్రపక్షం జనసేన పోటీ నుంచి వైదొలిగినా తాము మాత్రం పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది.
బీజేపీ నాయకత్వం నలుగురి పేర్లను పరిశీలించి, అధిష్టానం ఆమోదం కోసం జాబితాను పంపించింది. అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేస్తుంది. 2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతిని అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆమె కూడా అంగీకరించారని నేడో రేపో అభ్యర్థి ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ పోటీ చేసినా జనసేన మద్దతివ్వడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ డాక్టర్ సుధకే మద్దతిస్తున్నట్లుగా చెప్పారు. దివంగత ఎమ్మెల్యే భార్య కాబట్టి పోటీ చేయడం లేదని చెప్పడం నేరుగా మద్దతివ్వడం కిందకే వస్తుంది.ఇప్పుడు మిత్రపక్షం పోటీ చేసినా జనసేన మద్దతు ఇవ్వదు.
Also Read : రాష్ట్రాల హక్కులపై ఒక్క స్టాలిన్‌కేనా బాధ? మిగతా సీఎంలు ఎందుకు స్పందించరు?
వైసీపీ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేలుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆయన సతీమణి దాసరి సుధను పోటీకి దించాలని వైసిపీ నాయకత్వం నిర్ణయించింది. ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం సంప్రదాయాన్ని గౌరవించాలని నిర్ణయించడంతో ఉపఎన్నిక ఏకగ్రీవం అవుతందని అనుకున్నారు. కానీ పోటీ అనివార్యం కావడంతో లక్ష ఓట్ల మెజార్టీనే లక్ష్యంగా పని చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
అక్టోబర్ నెల 8 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బద్వేలు పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు... 2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది.
Also Read : సొంత పార్టీ ప్రత్యర్థులకు రోజా "తమిళ" సెంటిమెంట్ చెక్ ! వర్కవుట్ అయితే ఎదురు లేనట్లే !?