AP High Court : 12 శాతం వడ్డీ - 4 వారాల గడువు.. బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశం !
ఉపపాధి హామీ పనుల బిల్లుల విషయంలో నెలల తరబడి సాగుతున్న విచారణలో తుది తీర్పు వచ్చింది. ప్రభుత్వం 12 శాతం వడ్డీతో నాలుగువారాల్లో బకాయిలు చెల్లించాలని ఏపీ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై ఏపీ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. మొత్తం 1013 పిటిషన్ల బిల్లుల చెల్లింపులను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. 20 శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే కొంత చెల్లించి ఉంటే మిగతా బకాయిలను 12 శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు పరిష్కారం అయ్యాయి. ఈ అంశంపై ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : రాష్ట్రాల హక్కులపై ఒక్క స్టాలిన్‌కేనా బాధ? మిగతా సీఎంలు ఎందుకు స్పందించరు?
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018-19 సమయంలో ఉపాధి పనులు చేసిన వారికి తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. నిజానికి ఈ పనులకు నిధులు ఇచ్చేది కేంద్రం ప్రభుత్వం. లెక్క ప్రకారం కేంద్రం మంజూరు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పనుల్లో అక్రమాలు జరిగాయన్న కారణంగా చెల్లింపులు నిలిపివేసింది. 2018-19 సంవత్సరానికి గాను అధికారిక లెక్కల ప్రకారం 7 లక్షల పైచిలుకు పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చేసిన పనులకు అధికారులు కొలతలు తీసి.. బిల్లులు కూడా సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో చెల్లింపులు నిలిపివేసింది. విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో బిల్లులు నిలిపివేశారు.
Also Read : సమస్య ఆర్యన్ ఖానా ? డ్రగ్సా ? ఎప్పటికి తెలుసుకుంటారు ?
అనేక మంది కోర్టులకు వెళ్లడంతో వారికి డబ్బులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రం అనేక కారణాలను చెప్పింది. కేంద్రం నిధులివ్వలేదని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసి సమాధానం రాబట్టింది. ఇప్పుడు ఇవ్వాల్సిన దాని కన్నా ఎక్కువే ఇచ్చామని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నప్పటికీ బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం మొత్తం నిధులు ఇచ్చినా చెల్లింపులు చేయలేదంటే ఇతర పథకాలకు మళ్లించారా అని హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. విచారణల్లో పదే పదే వేర్వేరు వివరాలను ప్రభుత్వం చెబుతూండటంపై ధర్మాసనం పలుమార్లు అసహనం వ్యక్తం చేసింది.
ఉపాధి హామీ పనులు చేసిన వారిలో అత్యధికం అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులే ఉన్నారు. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ఉద్యమాలు కూడా చేసింది. చివరికి న్యాయపోరాటంలో విజయం సాధించారు. నాలుగు వారాల గడువును హైకోర్టు ఇచ్చింది. ప్రభుత్వం ఈ లోపు చెల్లించకపోతే తర్వాత కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసే ఆలోచనలో కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇప్పటికే పలు మార్లు హైకోర్టు ఆదేశించినా చెల్లింపులు చేయలేదు.
Also Read : సొంత పార్టీ ప్రత్యర్థులకు రోజా "తమిళ" సెంటిమెంట్ చెక్ ! వర్కవుట్ అయితే ఎదురు లేనట్లే !?