Stalin : రాష్ట్రాల హక్కులపై ఒక్క స్టాలిన్‌కేనా బాధ? మిగతా సీఎంలు ఎందుకు స్పందించరు?
కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుందని కలసి కట్టుగా పోరాడదామంటూ ముఖ్యమంత్రులకు తరచూ తమిళనాడు సీఎం లేఖలు రాస్తున్నారు. కానీ ఇతర సీఎంల నుంచి స్పందన ఉండటం లేదు.
దేశంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ సక్సెస్ కాలేదు. రాజకీయంగానే కాదు .. పాలనా పరంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాలు తమ హక్కులను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఎప్పటికప్పుడు విఫలమవుతూ వస్తున్నాయి. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. విద్యా విధానం విషయంలో రాష్ట్రాల హక్కులను లాగేసుకుంటున్న కేంద్రానికి వ్యతిరేకంగా కలసి పోరాడదాం రమ్మని ఆయన బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ లేఖ రాశారు. వారిలో ఎంత మంది స్పందిస్తారు..? ఎంత మంది స్టాలిన్‌లా ముందడుగు వేస్తారు ?
విద్యారంగంలో కేంద్ర పెత్తనాన్ని ఎదుర్కొందామని లేఖ!
విద్యారంగంలో కేంద్రం ఇటీవల అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అవి చాలా వరకూ రాష్ట్రాల హక్కులను హరించేవే. ఈ పెత్తనాన్ని నిలదీద్దామని.. కలసి పోరాటం చేద్దాం రావాలని 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖలురాశారు. జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇటీవలి కాలం రాష్ట్రాల హక్కులన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్న కేంద్రం వైఖరి స్టాలిన్‌కు నచ్చడం లేదు. విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని ఆయన ప్రయత్నిస్తున్నారు. కలసికట్టుగా పోరాడి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని ఆయన లేఖలో పిలుపునిచ్చారు. స్టాలిన్ ఇలా లేఖ రాయడానికి ప్రధానంగా నీట్‌ను కారణంగా చెప్పుకోవచ్చు. మెడికల్ ఎంట్రన్స్ కోసం దేశవ్యాప్తంగా నీట్ ను ప్రవేశ పెట్టారు. ఈ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేశారు.
Also Read : సమస్య ఆర్యన్ ఖానా ? డ్రగ్సా ? ఎప్పటికి తెలుసుకుంటారు ?
గతంలో పోర్టుల విధానాన్ని వ్యతిరేకిద్దామని లేఖ!
స్టాలిన్ ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాయడం ఇదే మొదటి సారి కాదు. పలుమార్లు రాశారు. కేంద్రం తీసుకొచ్చిన పోర్టుల బిల్లుపైనా ఇదే తరహాలో లేఖ రాశారు. కొత్తగా కేద్రం పోర్టుల బిల్లు కూడా తీసుకు వచ్చింది. ఈ బిల్లు ప్రకారం చిన్నతరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు కట్టబెడతారు. ప్రస్తుతం మైనర్‌పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ వంటివి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. కొత్త బిల్లు ద్వారా వాటిని కేంద్రం తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇది తీర ప్రాంత రాష్ట్రాల హక్కులను హరించడమేనని కలసికట్టుగా వ్యతిరేకిద్దామని తీర ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాశారు. ఏపీ సీఎం జగన్‌తో సహా పోర్టులు ఉన్న ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి.
Also Read : అమలులో లేని చట్టాలపై నిరసనలెందుకు? రైతులకు సుప్రీం ప్రశ్న
వ్యాక్సిన్ విధానంపైనా పోరాడదామని సీఎంలకు పిలుపు !
అంతకు ముందు మేలోనే కేంద్ర వ్యాక్సిన్ విధానంపై స్టాలిన్ విరుచుకుపడ్డారు. ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలనేది ఆయన విధానం. కేంద్రం ఉచిత వ్యాక్సిన్ విధానం తీసేసినప్పుడు పన్నెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఉచిత వ్యాక్సిన్ కోసం కేంద్రంపై పోరాటానికి కలసి రావాలన్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా కేంద్రం వ్యాక్సిన్ విధానంపై వ్యతిరేకత రావడంతో చివరికి వెనక్కి తగ్గారు.
రాజకీయ కారణాలతో స్టాలిన్‌కు మద్దతు ప్రకటించలేకపోతున్నసీఎంలు !
కేంద్రం రాష్ట్రాలకు అనేక సమస్యలు సృష్టిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల విషయంలోఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. చివరికి జనాభాను నియంత్రించినందుకు గాను లోక్‌సభ సీట్ల ప్రాతినిధ్యం దక్షిణాది కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే నిధులు కూడా తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో అందరం కలిసి పోరాడాలని చాలా ఏళ్ల నుంచి అనుకుంటున్నారు కానీ అందరూ ఏకతాటిపైకి రావడంలో విఫలమవుతున్నారు. దీనికి కారణం దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా అధికారంలో ఉండటం.. వారి ఢిల్లీ రాజకీయ ప్రాధాన్యలు వేర్వేరు కావడమే. అందుకే ఇప్పుడు స్టాలిన్ రాసిన లేఖకూ మద్దతు లభించడం కష్టమే.
Also Read : బాలీవుడ్ బాద్ షా కి అండగా అభిమానులు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న #WeStandWithSRK