Drugs Issue : సమస్య ఆర్యన్ ఖానా ? డ్రగ్సా ? ఎప్పటికి తెలుసుకుంటారు ?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై చర్చే. దేశంలో డ్రగ్స్ బారిన పడిన లక్షల మంది యువతలో ఆర్యన్ ఒకరు. సమస్య ఆర్యన్ కాదని డ్రగ్స్ మహమ్మారి అని గుర్తించలేకపోతున్నారు.
"ఆర్యన్ ఖాన్" ఇప్పుడీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. దేశంలో అతనొక్కడే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయినట్లుగా చెబుతున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ డాన్ ఆ కుర్రాడేనని తీర్మానించేస్తున్నారు. మీడియా, సోషల్ మీడియాల్లో అదే హడావుడి కనిపిస్తోంది. ఇంతా చేస్తే అతని వద్ద దొరికిన డ్రగ్స్ పదమూడు గ్రాములని ఎన్సీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కేసు అతని చుట్టూ తిరగడానికి కారణం అతను సూపర్ స్టార్ కుమారుడు కావడమే. అతన్ని మాత్రమే హైలెట్ చేస్తే డ్రగ్స్ సమస్య పరిష్కారం అవుతుందా ? కింగ్ పిన్స్‌ను పట్టుకునేందుకు ఎందుకు ఆసక్తి చూపించడం లేదు ?
వేల కేజీల హెరాయిన్ దొరికితే ఎవరూ పట్టించుకోలేదు !
గుజరాత్‌లోని ముంద్రా పోర్టు నుంచి దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన హెరాయిన్ దిగుమతి అయిందని తేలింది. రూ. 70వేల కోట్లకుపైగా విలువైన హెరాయిన్ దేశంలోకి ప్రవేశించిందని డైరక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ అధికారులు నిర్ధారించారు. వీటిలో రూ. తొమ్మిది వేల కోట్ల హెరాయిన్‌ను పట్టుకున్నారు. మిగతా అంతా ఇండియాలోకి వచ్చింది. వాటిని అక్కడి ప్రజలకు అమ్మారా లేకపోతే మరో పోర్టు నుంచి విదేశాలకు తరలించారా అన్నదానిపై స్పష్టత లేదు. దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని ఏ మీడియా.. సోషల్ మీడియా కూడా పెద్ద విషయంగా పట్టించుకోలేదు. ఆ డ్రగ్స్ ఇష్యూనే ఆర్యన్ ఖాన్ కు ఇచ్చినంత ప్రయారిటీలో సగం ఇచ్చినా దేశంలోని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఆ భారీ డ్రగ్స్ డీల్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల కోసం కనీసం వేట ప్రారంభించి ఉండేవన్న అభిప్రాయం ఉంది.
Also Read : బాలీవుడ్ బాద్ షా కి అండగా అభిమానులు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న #WeStandWithSRK
ఆర్యన్ ఖాన్ మాత్రమే కాదు దేశంలో లక్షల మంది డ్రగ్స్ బారిన పడిన యువత !
షారుఖ్ ఖాన్ కుమారుడు పార్టీలో పాల్గొని కొకైన్ తీసుకున్నాడని వెంటనే మాటు వేసి పట్టుకున్నారు. మీడియాకు ఏ టు జడ్ వివరాలు చెప్పి పరువు తీశారు. ఇక మీడియా ఇతర పనులను ప్రారంభించారు. రూ. 70వేల కోట్ల హెరాయిన్ కు దక్కని ప్రాధాన్యం రూ. లక్ష కొకైన్‌కు ఇస్తున్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఆఫ్రికన్లు, ఇతర పెడ్లర్లు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి వారి దగ్గర హెరాయిన్ లాంటి డ్రగ్ పట్టుబడితే వారి వద్ద ఉండే పరిమాణం.. ఐదు గ్రాములు.. పది గ్రాములు మాత్రమే. వాటినే వేలల్లో అమ్ముతూంటారు. అలాంటి 3వేల కేజీల హెరాయిన్ పట్టుబడిందంటే అది చిన్న విషయం కాదు. మామూలు విషయం అసలే కాదు. దేశంలో డ్రగ్స్ వాడకాన్ని హీరోయిజంగా చూసే పరిస్థితి. డబ్బున్న వారి కుటుంబాల్లో ఇది మరీ ఎక్కువ. కాలేజీలు, యూనివర్శిటీల్లో ఈ మత్తుపదార్థాల బెడత చాలా ఎక్కువ. బహిరంగంగానే అన్నీ జరిగిపోతూంటాయి. కానీ పట్టించుకునే వారెవరు..?
కొరవడిన నిఘా - నిర్వీర్యమవుతున్న యువత !
కేంద్రం విస్తృతంగా నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోయువత కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి మత్తుమందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్లు తేలింది. డ్రగ్స్ ఉచ్చులోకి ప్రధానంగా చేరుతోంది విద్యార్థులే. దేశంలో గంజాయి వాడేవారు 3.1 కోట్ల మంది, పదేళ్లలో ఓపీయం వినియోగదారుల పెరుగుదల 567 శాతంగా నమోదైంది. గంజాయి, భంగ్, చెరస్ కు బానిసలైన దేశంలో 3.1 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. 1985లో నార్కోటిక్ చట్టాన్ని భారత ప్రభుత్వం తెచ్చింది. అయినప్పటికీ డ్రగ్స్ ఇండియాలోకి రావడం తగ్గడం లేదు. ప్రస్తుతం ఇంజినీరింగ్ కాలేజీల్లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. ఏ కాలేజీ పేరెత్తినా డ్రగ్స్ మహమ్మారి పేరు వినిపిస్తూనే ఉంటుంది. టాల్కం పౌడర్ పేరిట అఫ్గాన్ నుంచి వచ్చిన 25 టన్నుల హెరాయిన్ దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు తరలిపోయినట్లు ఆలస్యంగా బహిర్గతమైంది. అది ఎంత మందిని నిర్వీర్యం చేస్తుందో ఊహిస్తే ఒళ్లు జలదరించడం ఖాయం.
Also Read : డ్రగ్స్ కేసులో కొత్త అప్‌డేట్.. షారుక్ కుమారుడికి కస్టడీ పొడిగింపు
సమస్య మూలంపై దెబ్బకొట్టాలి.. బాధితుల్ని కొడితే మొదటికే మోసం !
పేదరికాన్ని నిర్మూలించడం అంటే పేదలను నిర్మూలించడం కాదు. అలాగే డ్రగ్స్‌ను తరిమికొట్టాలి అంటే డ్రగ్స్ కు బానిసలుగా మారిన వారిలో సెలబ్రిటీల పిల్లలను వెదుక్కుని .. ట్రాప్ చేసి పట్టుకుని మీడియాలో హడావుడి చేసి.. ఆయన వల్లనే దేశంలో డ్రగ్స్ సమస్య ఉందని చెప్పడం కాదు. అసలు డ్రగ్స్ దందాను ఆపడానికి ఏం చేయాలో అది చేయాలి. ఇంత పెద్ద దేశంలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయే వ్యవస్థ లు ఉన్న దేశంలో అది పెద్ద సమస్య కాదు. కానీ అసలు సమస్య మూలంపై దృష్టి పెట్టకుండా ఇలా ఆర్యన్ ఖాన్ లాంటి వారిని పట్టుకుని హడావుడి చేసినంత మాత్రాన ఏమీ లాభం ఉండదు. ఇంకా చెప్పాలంటే అది చేటు చేస్తుంది. యువతలో డ్రగ్స్‌పై క్రేజ్ తీసుకు వస్తుంది. అది మొదటికే మోసం తెస్తుంది. ఈ విషయాన్ని గుర్తించేదెవరు..?
Also Read:Aryan Khan Drug Case: అవును.. నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాను: ఆర్యన్ ఖాన్