Jubilee Hills by-election : 42 టేబుల్స్, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి
Jubilee Hills by-election : మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ప్రక్రియ మధ్యాహ్నానికి ముగియనుంది.

Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల వెల్లడికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. పది రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు.
ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 186 మంది సిబ్బంది పాల్గొంటారు. వీళ్లతోపాటు పోలింగ్ జరిగే ప్రాంతం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 250 మంది సిబ్బందిని నియమించినట్టు జూబ్లీహిల్స్ ఆర్వో కర్ణన్ తెలిపారు. లెక్కింపు కేంద్రం చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉందని వెల్లడించారు. కేవలం అనుమతి ఉన్న వారికే లోపలికి వెళ్లనిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు ఆర్వో కర్ణన్ పేర్కొన్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా ఫలితాలను నిరంతరం ఎన్నికల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు అధికారులు. మీడియా కోసం ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు సిద్ధం చేశారు. ఒక్కో రౌండ్ లెక్కించడానికి 45 నిమిషాలు టైం పడుతుందని ఈ మేరకు అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామని వెల్లడించారు. సిబ్బంది, అభ్యర్థులు, వారి తరఫున వచ్చే ఏజెంట్లు ఉదయం ఐదు గంటలకు చేరుకోవాలన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి కానుంది.
పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం
రెండు రోజుల క్రితం జరిగిన పోలింగ్‌లో 47శాతానికిపైగా ఓటింగ్ శాతం నమోదు అయింది. ప్రచారం హోరాహోరీగా సాగినా ఈ ఉపఎన్నికల విజయం ఎవర్ని వరిస్తుందో అని ఎవరు లెక్కలు వారు వేసుకుంటున్నారు. లోలోపల మథన పడుతున్నా బయటకు మాత్రం గెలుపు తమదేనంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున సునీల్ యాదవ్ పోటీ చేస్తే బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత నిలబడ్డారు. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. పోటీలో ఎంతమంది ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంది. మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశారు. నెలరోజుల పాటు జోరుగా ప్రచారం సాగింది. అయితే పోలింగ్ రోజు 4,01,365 మంది ఓటర్లు ఉంటే, కేవలం 1,94,631 మంది మాత్రమే ఓట్లు వేశారు.
సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలం
సర్వేలు మొదట బీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం అన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెప్పాయి. అయినా సరే కచ్చితంగా ప్రజలకు తమవైపే ఉంటారని బూత్‌ల వారీగా పోలైన ఓట్లు తమ ప్రచార పంథాను పార్టీలు విశ్లేషించుకుంటున్నాయి. ఈ ఉపఎన్నికల్లో విజయం సాధించి ఇదే ఊపుతో జీహెచ్‌ఎంసీ, లోకల్ ఎన్నికలకు వెళ్లాలని అన్ని పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.





















