Nagababu: నాగబాబుకి మంత్రి పదవి లేదు.. తెర వెనుక ఏం జరిగింది?
Andhra Pradesh Politics | నాగబాబుకి ఎమ్మెల్సీ లేదు అని, అంటే ఏపీ కేబినెట్ లోకి మెగా బ్రదర్ కు అవకాశం లేనట్లే. అయితే తెర వెనుక ఏం జరిగింది అని చర్చ జరుగుతోంది.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు సినీ నిర్మాత నాగబాబుకి ఇవ్వాల్సిన పదవి పై కూటమి మధ్య క్లారిటీ రావడం లేదు. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా జరగనున్న 5 ఎమ్మెల్సీ పోస్టులు భర్తీలో ఒకటి నాగబాబు కిచ్చి ఉగాది నాటికి మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడంతో అంతా లాంఛనమే అనుకున్నారు జనసైనికులు. ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ అంటే నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడం లేదు. అలాగే ఎమ్మెల్సీ కూడా ఆయనకు రావడం లేదు. ఈ వార్త బయటకు రాగానే ఒక్కసారిగా జనసైనికుల్లో కలకలం రేగింది. కూటమి లో అసలేం జరుగుతుందంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
"వర్మ " ఫ్యాక్టర్
పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో తన ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ హామీ తీరలేదు. తరువాత సడన్ గా సీన్ లోకి నాగబాబు వచ్చారు. దీనితో పైకి చెప్పకపోయినా వర్మ ఫీలయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పైగా సెటైరికల్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వర్మ. ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ కూటమి లో ముఖ్యం గా పిఠాపురం లో చిచ్చు వచ్చే ప్రమాదం ఉందనే భావం తో వెనక్కి తగ్గారనే ప్రచారం జరుగుతోంది. జనసేనలో ఇప్పటికీ ముగ్గురు మంత్రులు ఉండగా వారిలో పవన్, కందుల దుర్గేష్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వారికి తోడు ఇప్పుడు నాగబాబు కూడా చేరితే పూర్తిగా జనసేనకు కాపుల పార్టీగా ముద్ర పడిపోతుంది. దానితో జనసేన వెనక్కి తగ్గినట్టుగా వార్తలు విన వస్తున్నాయి
రాజ్య సభే కావాలి.. జన సేన పట్టు
నిజానికి నాగబాబుకి రాజ్యసభ సీటు ఇవ్వడానికి అంతా రెడీ అయింది. ఆ టైంలో నారా లోకేష్ పట్టుదల వల్ల అది సానా సతీష్ కి వెళ్ళింది. ఆ సమయంలోనే నాగబాబుకి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. నాగబాబుకి రాజ్యసభ సీటు పైనే మక్కువ ఉందని పవన్ కళ్యాణ్ సైతం రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నారని జన సేన వర్గాలు చెబుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జనసేన రాజ్యసభ కోసం పట్టు పట్టిందని విజయ్ సాయి రెడ్డి ఖాళీ చేసిన స్థానం లో కూటమి కి దక్కే రాజ్యసభ సీటు ను నాగబాబు కే కేటాయించాలని పవన్ కళ్యాణ్ సైతం పట్టు పట్టడంతో చంద్రబాబు అటువైపు ఆలోచిస్తున్నారనేది సమాచారం. దానితో నాగబాబుకు రాజ్యసభ సీటు దాదాపు ఖరారు అయినట్టే తెలుస్తోంది. మరో వైపు ఎమ్మెల్సీ అక్కర్లేకపోతే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకోవాలని నాగబాబుకి సూచనలు వెళ్లాయని కానీ ఆయన ఇంతవరకు దానిపై స్పందించలేదు అనేది మరో కథను.
బిజెపితో జనసేన సర్దుబాటు..
నిజానికి విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటును బిజెపి తీసుకోవాలని అనుకుంది. కానీ ఇప్పుడు సీన్ లోకి జనసేన ఎంటర్ కావడంతో రాజ్యసభ సీటు నాగబాబుకి, ఆయన తీసుకోవాల్సిన MLC స్థానం రాష్ట్రంలో బిజెపికి ఇచ్చేలాగా బిజెపి జనసేన మధ్య ఒక సర్దుబాటు జరిగిందనేది జనసేన వర్గాల నుంచి వస్తున్న సమాచారం.





















