Terras Plantation : కర్కట రేఖకి, నెల్లూరులో మిద్దె తోటకి సంబంధం ఏంటి?
కర్కట రేఖని బేస్ చేసుకుని నెల్లూరులో మొక్కలు పెంచుతున్నాడో వ్యక్తి. కర్కట రేఖను ఆనుకుని దాదాపు 21 దేశాలున్నాయని, ఆయా దేశాల్లో ఒకే రకమైన శీతోష్ణ స్థితులు ఉంటాయని చెబుతున్నారు.
పెరటి తోట అనే కాన్సెప్ట్ ఎప్పటినుంచో ఉంది. మన ఇంట్లోకి అవసరమైన కూరగాయలు, ఆకు కూరల్ని ఇంటిలోని పెరట్లోనే పండించుకుంటారు చాలామంది. కాంక్రీట్ జంగిల్ పుణ్యమా అని ఇప్పుడు పెరడు అనేది మాయమైంది. మొక్కలన్నీ కుండీలకెక్కాయి, అవి కాస్తా టెర్రస్ పై అల్లుకుంటున్నాయి. టెర్రస్ గార్డెన్ అనేది ఇప్పుడు సిటీల్లోనే కాదు పల్లెటూళ్లలో కూడా ఓ ఆహ్లాదకరమైన హాబీ. అయితే ఈ టెర్రస్ గార్డెన్ లోనే నెల్లూరు కుర్రాడు తరుణ్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. మిద్దెపైనా ద్రాక్ష గుత్తులు కాసేలా చేశాడు. డ్రాగన్ ఫ్రూట్ కూడా మిద్దెపైనే. నిమ్మ మొక్కలు కూడా అదే మిద్దెపైన విరగ కాశాయి.
నెల్లూరు వనంతోపు సెంటర్ లో తరుణ్ మూడేళ్లుగా టెర్రస్ గార్డెన్ ని పెంచుతున్నాడు. కరోనా టైమ్ లో తనకు ఖాళీ సమయంలో ఈ ఆలోచన వచ్చిందని, దాన్ని తాను అమలులో పెట్టానని అంటున్నారాయన. తనతోపాటు ఇలాగే మిద్దె తోటలు పెంచేవారందరితో కలసి తరుణ్ కూడా ఓ గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. ఆ గ్రూప్ లో ఉండేవారంతా ఇలాగే మిద్దెతోటలు పెంచుతుంటారు. ఒక్కొకరి ఇంట్లో ఒక్కో రకమైన మొక్కలు ఉంటాయి. వారంతా అందరి ఇళ్లలో అలాంటి మొక్కలు పెంచాలని అనుకుంటారు. ఒకవేళ ఒకరి దగ్గర మొక్కలు చనిపోతే, ఇంకొకరి దగ్గరనుంచి తెచ్చుకుని పెంచుకుంటారు. అలాగే ఇతర విషయాల్లో కూడా మొక్కలకు అవసరమైన జాగ్రత్తలను షేర్ చేసుకుంటారు.
కర్కట రేఖని బేస్ చేసుకుని తరుణ్ మొక్కల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. కర్కట రేఖను ఆనుకుని దాదాపు 21 దేశాలున్నాయని, ఆయా దేశాల్లో ఒకేరకమేన శీతోష్ణ స్థితులు ఉంటాయని, కానీ అన్ని చోట్లా ఒకేరకమైన మొక్కలు ఉండవని చెబుతున్నారు తరుణ్. అసాధ్యం కాకపోయినా ఈ 21 దేశాల్లో ఒక చోట బతికిన మొక్క మిగతా దేశాల్లో కూడా బతకగలదని అంటున్నాడు. దాని ప్రకారం తాను మొక్కల్ని ఎంపిక చేసుకుంటున్నానని చెప్పాడు.
నెల్లూరులో టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నవారంతా ఓ గ్రూప్ గా ఏర్పడి మొక్కల్ని పెంచుతున్నారు. దీనివల్ల చాలా లాభాలున్నాయని అంటున్నాడు తరుణ్.
కూరగాయలు, ఆకు కూరలే కాదు.. తరుణ్ టెర్రస్ గార్డెన్ లో ఆయుర్వేద మొక్కలు కూడా పెంచుతున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఈ మొక్కల ద్వారా అదుపు చేయవచ్చని, తన తల్లిదండ్రులకో, చుట్టుపక్కలవారి కోసం ఈ మొక్కల్ని పెంచుతున్నానని చెబుతున్నాడు తరుణ్. షుగర్ ని నియంత్రించే మొక్కలు, కిడ్నీ స్టోన్స్ కి సంబంధించినవి, అజీర్తిని తగ్గించే మొక్కలు తన వద్ద ఉన్నాయని అంటున్నారు.
డాబాపైన మొక్కలు పెంచేవారు కూడా ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నారని అనుకోవచ్చు. కానీ భవిష్యత్తు వ్యవసాయ రంగానిదేనంటున్నారు తరుణ్. ఇప్పుడంతా ఆర్గానిక్ ఫుడ్ వైపు పరుగులు పెడుతున్నారని, ఆర్గానిక్ ఫుడ్ ని మనమే పండించుకోగలిగితే ఆరోగ్యంతోపాటు, ఆర్థికంగా కూడా మేలు అని చెబుతున్నారు. మొత్తమ్మీద హాబీగా మొదలైన ఈ మిద్దెతోటల పెంపకం ఇప్పుడు తరుణ్ లాంటి వారికి ఉపాధి కూడా కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యంతోపాటు, ఆర్థికంగా మేలు చేసే ఇలాంటి మిద్దె తోటలను హాబీగా చేసుకుంటే భావి తరాలకు కూడా ఆరోగ్యకరమైన అలవాట్లను అందించినవారమవుతాం.