Nellore News : రెండేళ్ల తర్వాత నెల్లూరు రొట్టెల పండుగ, ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
Nellore News : నెల్లూరు రొట్టెల పండుగకు తేదీలు ఖరారు అయ్యాయి. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా రొట్టెల పండుగ నిర్వహించలేదని, ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో భక్తులు, యాత్రికులు దర్గాను సందర్శించే అవకాశముందని తెలిపారు మంత్రి కాకాణి.
Nellore News : నెల్లూరు జిల్లాకే కాదు, రాష్ట్రానికే తలమానికంగా ప్రతి ఏడాదీ నెల్లూరు నగరంలో రొట్టెల పండగ నిర్వహిస్తారు. నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో రొట్టెల పండగ నిర్వహిస్తారు. అక్కడి స్వర్ణాల చెరువులో రొట్టెలను మార్చుకుంటారు ప్రజలు. తమకు అనుకూలమైన పని జరిగినప్పుడు ఆయా రొట్టెల పేర్లు చెప్పి అవి అవసరమైన వారికి ఇస్తారు. వచ్చే ఏడాది తమకు ఆయా పనులు జరిగినప్పుడు వారు కూడా అలాగే రొట్టెలను తెచ్చి ఇవ్వడం ఆనవాయితీ. చదువు, ఆరోగ్య సంబంధ సమస్యలు, వివాహం, ఉద్యోగం, విదేశీ యానం.. ఇలా రకరకాల రొట్టెలను ఇక్కడ మార్చుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి 13 వరకు నెల్లూరులో రొట్టెల పండగ జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండేళ్ల తర్వాత
మతసామరస్యానికి ప్రతీకగా నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగను నిర్వహిస్తారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల రొట్టెల పండగను నిర్వహించలేదు. కేవలం గంధ మహోత్సవాన్ని మాత్రమే నిర్వహించారు. భక్తులను రొట్టెలు మార్చుకోడానికి దర్గా వద్దకు అనుమతించలేదు. రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది పండగను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ జిల్లాకే తలమానికంగా ఈ ఏడాది పండగ నిర్వహిద్దామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బారా షహీద్ దర్గా రొట్టెల పండగ సమీక్షా సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై సమీక్ష నిర్వహించారు.
సీఎం జగన్ కు ఆహ్వానం
కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా రొట్టెల పండుగ నిర్వహించలేదని, ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో భక్తులు, యాత్రికులు దర్గాను సందర్శించే అవకాశముందని తెలిపారు మంత్రి కాకాణి. గతంలో పండగను నిర్వహించిన అనుభవం ఉన్న అధికారులు ప్రస్తుతం బదిలీల్లో ఉన్నప్పటికీ, తాత్కాలికంగా వారి సేవలను వినియోగించుకునేలా సంబంధిత జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతామని మంత్రి తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున మౌలిక వసతులైన మంచినీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. బారా షహీద్ దర్గా దర్శనం అనంతరం భక్తులు, యాత్రికులు జిల్లాలోని ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. అలాంటి అన్ని ప్రాంతాలను గుర్తించి సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకున్న బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
ఏర్పాట్లపై సమీక్ష
స్వర్ణాల చెరువు పరిశుభ్రత కోసం జిల్లా ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, కార్పొరేషన్, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ పనులు మొదలు పెడతామని చెప్పారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. ప్లకార్డుల నిర్వహణ, షెల్టర్ల ఏర్పాటు, భక్తులకు విశ్రాంతి భవనాలు, నిరంతర విద్యుత్ సౌకర్యం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంచార ఆసుపత్రులు, ప్రత్యేక క్లినిక్ లు, ఉచితంగా మందుల పంపిణీ, 108 అత్యవసర సేవలు, పోలీసు విభాగం ఆధ్వర్యంలో శాంతి భద్రతలు, బారికేడ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. అవసరమైతే రోప్ పార్టీ, క్విక్ రెస్పాన్స్ టీమ్ లు ఏర్పాటుతో తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపడుతామని చెప్పారు. స్వర్ణాల చెరువు ప్రాంగణంలో రొట్టెలు మార్చుకున్న బట్టలు మార్చుకునేందుకు వసతులు కల్పిస్తామన్నారు. దర్గా కమిటీ సభ్యులు జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ వి.ఐ.పిల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు. దర్గా ప్రాంగణంలో భక్తులు తిరిగేందుకు వీలుగా ఎక్కువ సంఖ్యలో దుకాణాలకు అనుమతులు ఇవ్వకుండా దర్గా కమిటీ సభ్యులు సహకరించాలని కలెక్టర్ కోరారు. 24 గంటలు సేవలు అందించేలా 3 షిఫ్టులలో అన్ని విభాగాల సిబ్బందిని నియమించి రొట్టెల పండుగ ప్రతిష్ట నిరంతరం కొనసాగేలా కృషి చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.