Nara Lokesh: 'జగన్ జమానాలో దళితులకు రక్షణ లేదు' - కంచికచర్ల ఘటనపై లోకేశ్ ఆగ్రహం
Nara Lokesh: సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
సీఎం జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకూ ఎంతో మంది దళిత బిడ్డలు బలయ్యారని, తాజాగా మరో దారుణం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేడ్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కొందరు దుండగులు నిర్భంధించారన్నారు. 4 గంటలు చిత్ర హింసలకు గురి చేశారని, దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్య సమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని ధ్వజమెత్తారు.
'సీఎం జగన్ కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా, ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితున్ని అని వాపోవడం, జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట' అని లోకేశ్ ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు.
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా, తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు… pic.twitter.com/gE5KinSYmD
— Lokesh Nara (@naralokesh) November 3, 2023
'సీఎం పదవికి జగన్ అనర్హుడు'
టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ తాజాగా ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. దీనిపైనా నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆ పదవికి అనర్హుడని, ఆయన మానసిక స్థితిపై కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపించాలని కోరారు. చంద్రబాబుపై కక్షతో రోజుకో తప్పుడు కేసు పెడుతున్నారని, జగన్ మానసిక స్థితిపై జనం చర్చించుకుంటున్నారని అన్నారు. కక్ష పూరితంగా వ్యవహరిస్తోన్న జగన్ తీరు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు. సీఐడీని వైసీపీ అనుబంధ విభాగంగా మార్చకుని ప్రతిపక్ష నేతలపై కేసుల మీద కేసులు పెట్టడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని లోకేశ్ మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సరైన పద్ధతి కాదని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ధ్వజమెత్తారు.
'స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రూపాయి అవినీతీ జరగకపోయినా కేసు బనాయించారు. ఈ రోజుకీ ఒక్క ఆధారం చూపించలేకపోయారు. వేయని రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారని ఓ కేసు, ఉచితంగా ఇసుక ఇస్తే అందులోనూ స్కామ్ అంటూ ఇప్పుడు మరో కేసు పెట్టారు. దేశంలోనే పేరు ప్రఖ్యాతలున్న ఫైబర్ నెట్ ప్రాజెక్టుపైనా కేసు పెట్టారు.' అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
Also Read: రుషికొండలో నిర్మాణాలపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు - రాజకీయ కారణాలతో వేసినట్లుందని ఆగ్రహం