Janasena : వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట - తప్పులు చేస్తే అధికారుల బలైపోతారని నాగబాబు హెచ్చరిక !
సీఎం జగన్ చెప్పారని తప్పులు చేస్తే అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని నాగబాబు హెచ్చరించారు. టీడీపీతో కలిసి పని చేయాలని జనసైనికులకు తిరుపతిలో సూచించారు.
Janasena : వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట అని ఆయన మాటలు విని అధికారులు తప్పులు చేయ వద్దు అని జనసేన నేత నాగబాబు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆయన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పులు చేసిన ప్రతి అధికారి భవిష్యత్తులో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రం అథోగతి పాలైందని తెలిపారు. మరోసారి ఛాన్స్ ఇస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారన్నారు. జనసేన, టీడీపీ కలిసి పని చేస్తేనే వైసీపీ దౌర్జన్య పాలనకు అంతం పలుకుతుందన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ధర్మో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తే... ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ధనమో రక్షతి రక్షితః అనే సిద్ధాంతాన్ని నమ్ముతారని నాగబాబు విమర్శించారు. వ్యవస్థలు, అధికారులను మేనేజ్ చేయడంలో జగన్ దిట్టని, ఆయన మాటలు విని అధికారులు తప్పులు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అధికారులకు ఆరు నెలలు సమయం ఇస్తున్నాం పద్ధతి మార్చుకోవాలని సూచించారు. శనివారం తిరుపతి నగరంలో తిరుపతి, శ్రీకాళహస్తి నియోజక వర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం
రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం పెరిగిపోయిందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కంటికి కనిపించిన భూములను కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, దేవుడి భూములు అని చూడకుండా కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. వారి దౌర్జన్యాలు, దాష్టీకాలపై మాట్లాడితే దాడులకు పాల్పడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమం ముసుగులో ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారం తాకట్టు పెడుతున్నాడు. మరోసారి ఆయనకు అధికారం ఇస్తే మన ఇంటి పత్రాలను కూడా బలవంతంగా లాక్కొని మరి తాకట్టు పెడతాడని జోస్యం చెప్పారు.
తెలుగుదేశంతో కలి సి పని చేయాలి
నిస్వార్థంగా పని చేసే ప్రతి కార్యకర్తకీ మంచి భవిష్యత్ జగన్ దుర్మార్గ, దౌర్జన్య పాలనను అంతమొందించాలంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క జన సైనికుడు, వీరమహిళ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. పొత్తులకు తూట్లు పొడిచేలా ఎవరూ ఎక్కడా మాట్లాడొద్దు... పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం మనందరి బాధ్యత అన్నారు. పదేళ్లు ఎదురుచూశాం. మరికొద్ది రోజులు క్రమశిక్షణగా పని చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. వచ్చేది ముమ్మాటికి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమే. కష్టపడి, నిస్వార్థంగా పని చేసే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుంది” అని హామీ ఇచ్చారు.