Vizag-Vizianagaram Twin Cities: విశాఖ-విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి... విశాఖలో వెయ్యి పార్కులు... ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
విశాఖ-విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖలో వెయ్యి పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖను అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక చేపడతామన్నారు.
విశాఖ- విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ తాగునీటి అవసరాలు తీర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం విశాఖలో పార్క్ అభివృద్ధి కార్యక్రమానికి విజయసాయి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ-భోగాపురం అనుసంధానిస్తూ 70 మీటర్ల విస్తీర్ణంతో రహదారిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్డుపై వాహనాలు ప్రయాణించే సమయం, వేగం, నిర్దిష్ట ప్రమాణాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రహదారులు అభివృద్ధి శాఖ నిశితంగా పర్యవేక్షించి అభివృద్ధికి నిధులు అందిస్తాయన్నారు. ఈ రహదారి నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే సుముఖత తెలిపిందని స్పష్టంచేశారు.
అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం
భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి జరిగిన తర్వాత, విశాఖ ఎయిర్ పోర్ట్ రక్షణ రంగశాఖకు సంబంధించినది కాబట్టి దానిని పూర్తిస్థాయిలో వారికి అప్పగించనున్నట్లు ఎంపీ విజయసాయి స్పష్టంచేశారు. పురుషోత్తపట్నం నుంచి విశాఖకు తాగునీరు తీసుకొచ్చే ఏర్పాట్లు త్వరలోనే పూర్తికానున్నట్లు వెల్లడించారు. విశాఖను అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోందని చెప్పారు.
విశాఖలో వెయ్యి పార్కులు
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. విశాఖలో వెయ్యి పార్క్ లను, 216 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. 794 మురికివాడలను అభివృద్ధి చేసి ఇళ్ల పట్టాలు అందిస్తామని వెల్లడించారు.