Bandi Sanjay: కొవిడ్ సాకుతో ఉప ఎన్నికల వాయిదా వేయిస్తవా.. మరి స్కూళ్లెందుకు తెరిపించినవ్.. బండి సంజయ్ నిలదీత
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాందాన్ పల్లి శిబిరంలో బండి సంజయ్ డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీచర్లను బండి సంజయ్ సన్మానించారు.
కొవిడ్ సాకుతో హుజూరాబాద్ ఉప ఎన్నికలను వాయిదా వేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా సంస్థలను ప్రారంభించడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఓడిపోతారనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఉప ఎన్నికను వాయిదా వేయించారని ఆరోపించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాందాన్ పల్లి శిబిరంలో బండి సంజయ్ డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీచర్లను బండి సంజయ్ సన్మానించారు.
కార్పొరేట్ స్కూళ్లు ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షలు వసూలు చేసి టీఆర్ఎస్ నేతలకు కమీషన్లు ఇచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. ఫీజులు వసూలు చేసిన తర్వాత కార్పొరేట్ సంస్థలు కోవిడ్ సాకుతో స్కూళ్లను మూసేసిన విషయాన్ని గుర్తు చేశారు.
దేశానికి, సమాజానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను కొనియాడారు. తాను ఈ స్థాయిలో ఉన్నాననంటే తన తండ్రి టీచర్ కావడమే కారణమన్నారు. తన తండ్రి వల్ల దేశం, ధర్మం గురించి ఆలోచించడం నేర్చుకోవడంతోపాటు నిత్యం ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశాలకు వెళుతూ ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. రాష్ట్రంలో కిలోమీటర్‌కు ఓ పాఠశాల ఉండాలని.. కేసీఆర్ పాలనలో అందుకు భిన్నంగా కిలోమీటర్‌కు ఓ వైన్స్ షాపు, బార్ ఉన్నాయని విమర్శించారు. కొత్త టీచర్ పోస్టుల భర్తీ ఊసే లేదని, ఉన్న స్కూళ్లను మూసివేయిస్తూ టీచర్ల సంఖ్యను తగ్గిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ ఉపాధ్యాయ సంఘాలను రద్దు చేస్తానని బెదిరించడంతో భయపడిన టీచర్లు టీఆర్ఎస్‌కు ఓటేసి పొరపాటు చేశారని పేర్కొన్నారు. దేశాన్ని తీర్చిదిద్దాల్సిన టీచర్లే భయపడితే ఇక సమాజం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని కోరారు
పెద్దోళ్లు చస్తే పూలబొకేలు తీసుకెళ్లి సంతాపాలు తెలిపి మీడియాకు ఫోజులిచ్చే కేసీఆర్ పేదలు, విద్యార్థులు, టీచర్లు చనిపోయినా పట్టించుకోలేదని, కనీసం పరామర్శించిన దాఖలాల్లేవని మండిపడ్డారు. ప్రజాకంటక, అవినీతి పాలన చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చివేసి శక్తివంతమైన తెలంగాణను నిర్మించేందుకే తాను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నానని, ఈ యాత్రకు రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా బాసటగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీమంత్రి చంద్రశేఖర్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, లంకల దీపక్ రెడ్డి, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Live: Felicitating Teachers on the occasion of Teachers Day https://t.co/dzWZu84DKa
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 5, 2021
Live: #PrajaSangramaYatra | Day - 9 https://t.co/ok8GkLZhdp
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 5, 2021