Gorantla Calm : రాజీనామాపై గోరంట్ల సైలెన్స్.. టీడీపీలో వివాదం సద్దుమణిగినట్లేనా..?
25న రాజీనామా చేస్తానన్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల సైలెంట్‌గా ఉండిపోయారు. పార్టీ హైకమాండ్ పంపిన త్రిసభ్య బృందంతో ఆయన తన సమస్యలన్నీ చెప్పారు. చర్యల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివాదం సమసిపోయిందా.. ? 25వ తేదీన రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన సైలెంట్‌గా ఉండిపోయారు. అలాగని తాను కూల్ అయిపోయానని సమస్యలన్నీ సమసిపోయాయనని ప్రకటించలేదు. అదే సమయంలో తాను గతంలోలా అదే స్థాయిలో అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా చెప్పడం లేదు. ఇప్పటికైతే ఆయన మౌనం పాటిస్తున్నారు. రాజీనామా అంశాన్ని ప్రస్తుతం పక్కన పెట్టేశారు. దీంతో ఇప్పటికైతే సమస్య పరిష్కారం అయినట్లేనని టీడీపీ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో కీలక నేత. ఆయన పొలిట్ బ్యూరో మెంబంర్ కూడా . అలాంటిది హఠాత్తుగా తాను పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లుగా ఆయన చెప్పడం కలకలం రేపింది. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. దీనికి కారణంగా ఆయన చెప్పింది తనకు గౌరవం దక్కడం లేదనే. రాజమండ్రి టీడీపీలో ఉన్న వర్గ విబేధాలు, తన మాటలను హైకమాండ్ వినిపించుకోకపోవడం, కనీస గౌరవం కూడా దక్కడం లేదన్న బాధతో ఆయన పార్టీకి రాజీనామా చేయాలనుకున్నారు. గోరంట్ల అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు పార్టీ హైకమాండ్ పట్టించుకోలేదు. అయితే రాజీనామా అంశాన్ని మీడియాకు లీక్ చేసినప్పుడు మాత్రం కంగారు పడింది. పార్టీ సీనియర్ నేతలందర్నీ గోరంట్లతో మాట్లాడేలా పురమాయించింది.
తర్వాత ముగ్గురు సభ్యులతో సమస్య పరిష్కారానికి టీడీపీ అధినేత చంద్రబాబు కమిటీని నియమించారు. నిమ్మకాయల చినరాజప్ప, జవహర్, గద్దె రామ్మోహన్ గోరంట్లతో సమావేశమై సమస్యలపై చర్చించారు. నివేదికను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఇచ్చారు. గోరంట్ల ఏం చెప్పారు..? టీడీపీ అధినేత ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నది ముందు ముందు తేలాల్సి ఉంది. గతంలో తాను ఫోన్లు చేసినా ఎత్తలేదని, తనకు గౌరవం ఇవ్వలేదన్న కారణంగా తాను వెళ్లి చంద్రబాబును కలిసేది లేదని గోరంట్ల ప్రకటించారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగిన తర్వాత ఎవరూ పెద్దగా నమ్మలేదు. టీడీపీ నేతలు కూడా ఆయన రాజీనామా చేయరని అనుకున్నారు. టీడీపీతో ఆయనకు ఉన్న అనుబంధం అలాంటిదని సీనియర్ నేతలే చెప్పుకున్నారు. అయితే అదే అడ్వాంటేజ్‌గా అవమానిస్తే ఎలా ఉంటారని బుచ్చయ్య చౌదరి వర్గీయులు అంటున్నారు. ప్రస్తుతం వివాదం సద్దుమణిగినా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెలిబుచ్చిన అభిప్రాయాలతో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆయన తరవాత అయినా మళ్లీ తన అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉందన్న అబిప్రాయం టీడీపీలోనే వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే వివాదం సద్దుమణిగినట్లే భావించాలి.