(Source: ECI/ABP News/ABP Majha)
Minister Botsa Satyanarayana: పేదల ఇళ్లపై ఎప్పుడూ ఏడుపేనా చంద్రబాబు?
నిరుపేద ప్రజల సంక్షేమం, మధ్య తరగతి వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 30 లక్షల ఇళ్లు కట్టిస్తున్న నేపథ్యంలో దానికి తూట్లు పొడవాలని కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చారని విమర్శించారు. దాంట్లో అక్రమాలు జరిగాయని గగ్గోలు పెడుతున్నారని.. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమైతే డెమోగ్రఫిక్ ఇమ్‌బ్యాలెన్సెస్ వస్తాయని, ప్రజల్లో అసమానతలు వస్తాయని లేనిపోనివి సృష్టిస్తున్నారన్నారు.
విశాఖలో పేదల ఇళ్ల కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తే.. ఆ ప్రాంతంలో భూమి ఇచ్చిన వారు కాకుండా దానికి సంబంధం లేని వ్యక్తులు సమస్యలు సృష్టిస్తు్న్నారని మంత్రి బొత్స ఆరోపించారు. సాంకేతిక పరమైన అంశాలు అడ్డం పెట్టుకొని న్యాయస్థానాలకు పోయి వాటి మీద స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశారన్నారు. పేదలకు ఇళ్లు అందకుండా చూస్తున్నారన్నారు.
ఓటీఎస్‌తో ఎన్నో ప్రయోజనాలు
ఇటీవలే నిరుపేదల ఇళ్ల రుణాలకు సంబంధించి ఓటీఎస్ ప్రకటించాం. పేదలకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని నిర్ణయించాం. వారి ఇంటి మీద ఎంత అప్పు ఉన్నా సరే, ఒకేసారి కొంత మొత్తం.. రూ.10 వేలు (గ్రామీణ ప్రాంతాలు), 15 వేలు (పట్టణాలు), రూ.20 వేలు (నగరాలు) చెల్లిస్తే, వారికి ఆ ఇంటిపై పక్కాగా హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని నిర్ణయించాం. దీని ద్వారా వారి ఆర్థిక అవసరాలు కూడా తీరుతాయని భావించాం. ఎలా అంటే వారికి తమ ఇంటిపై హక్కులు ఇస్తూ, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే, అత్యవసర పరిస్థితుల్లో ఆ ఇంటిని తాకట్టు పెట్టుకోవడం లేదా అమ్ముకోవడం చేయొచ్చు. లేదా పిల్లల పెళ్లిల్లకు ఇంటిని కట్నాలు, కానుకల కింద ఇవ్వొచ్చు. పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తూ ఈ కార్యక్రమం పెడితే దానిపైనా గగ్గోలు పెడుతూ, పెడర్థాలు తీస్తూ లేనిపోని అలజడి సృష్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు.
- మంత్రి బొత్స సత్యనారాయణ
పేదలకు భూబ్యాంక్
'కొత్త లేఅవుట్లలో 5 శాతం భూమి లేదా ఆ లేఅవుట్‌కు 3 కి.మీ దూరంలో అంతే భూమి కొనివ్వడం. లేదా ఆ భూమి కార్డు విలువ ప్రభుత్వానికి కడితే, పేదల కోసం భూమి బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తే.. దాన్నీ తప్పు పడుతున్నారు. ప్రభుత్వం ధనార్జన కోసం, నిధుల సేకరణ కోసమే ఆ పని చేస్తుందని విమర్శిస్తున్నారు. నేను సూటిగా చంద్రబాబును ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు నిరుపేదలు అంటే ఎందుకు అంత కోపం? వారిపై ఎందుకు మీకంత కక్ష? బలహీన వర్గాల మీద ఎందుకంత ఆక్రోషం? ప్రభుత్వం ఏం చేస్తున్నా సరే అదే పనిగా నిందిస్తున్నారు.' అని బొత్స ప్రశ్నించారు.
పార్లమెంటులోనూ..
పార్లమెంటులో కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని బొత్స అన్నారు. ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, అందువల్ల సంక్షేమ కార్యక్రమాలు ఆపేయాలని సాక్షాత్తూ రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు మాట్లాడుతున్నారన్నారు. అప్పు అనేది ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి తీసుకుంటారని పేర్కొన్నారు. సీఎం జగన్ ఏ కార్యక్రమం తీసుకున్నా.. అంకితభావంతో పని చేస్తారని.. అదే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాటలతో మోసం, మాయ చేయడాన్ని చాలాసార్లు చూశామని విమర్శించారు.
ఏనాడైనా వాస్తవాలు మాట్లాడారా?
ఈ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అవుతోందని.. ఏనాడైనా ప్రభుత్వం తెచ్చిన ఏ పథకాన్ని అయినా హర్షించారా? అని బొత్స ప్రశ్నించారు. ఆంధ్రరాష్ట్రం అప్పుడే పుట్టిన బిడ్డ అని 2014 ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. పెంచుతాను అని ఒక అవకాశం ఇవ్వమని అడిగి అధికారం చేపట్టారు. కానీ ఆ తర్వాత ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా మోసం చేశారని బొత్స ఆరోపించారు.
Also Read: CM Jagan Review : ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !
Also Read: Tollywood Drugs : టాలీవుడ్ డ్రగ్స్ కేసు క్లోజ్ .. ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది !?
Also Read: Anantapur: ఈ రోజుల్లోనూ రూపాయికే దోశ.. ఇక్కడ సావిత్రమ్మ చాలా ఫేమస్, అంత తక్కువకి ఎలా ఇస్తున్నారంటే..