Anantapur: ఈ రోజుల్లోనూ రూపాయికే దోశ.. ఇక్కడ సావిత్రమ్మ చాలా ఫేమస్, అంత తక్కువకి ఎలా ఇస్తున్నారంటే..
బతుకులు భారం అవుతున్న తరుణంలో లాభాపేక్ష లేకుండా రూ.1 కే దోశలు అందిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.. తాడిపత్రిలోని ఓ వృద్దురాలు.
ఇప్పుడున్న అధిక ధరల కాలంలో రూపాయికి ఏమి వస్తుంది? అని ఎవరైనా అడిగితే ఆలోచించాల్సిందే. ఈ రోజుల్లో ఈ ప్రశ్నకు ఠక్కుమని సమాధానం చెప్పడం కష్టమే. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే చిన్నారికి రూపాయి ఇచ్చినా తీసుకోవడానికి ఇష్టపడని రోజులివి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యాచకులకు రూపాయి దానం చేసినా నాణేలకు కాలం చెల్లిపోయిందన్నట్టు ఏగాదిగా చూస్తుంటారు. కానీ, అనంతపురం జిల్లా తాడిపత్రి వాసులను రూపాయికి ఏమి వస్తుందని అడిగి చూడండి. ఠపీమని సమాధానం చెబుతారు. రూపాయికి ఏం కొనుక్కోవచ్చని అడిగితే తడుముకోకుండా సావిత్రమ్మ దోశలు అని చెబుతారు. అవును మరీ.. సావిత్రమ్మ దోశలంటే తాడిపత్రిలో అంత ఫేమస్ మరి.
తాడిపత్రి ప్రాంతంలో సావిత్రి అవ్వ దోశలు అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంత ఫేమస్ కావడానికి మరో కారణం ఉందండోయ్.. రుచితో పాటు చౌకగా రూ.1కి ఒక దోశ ఇస్తోందంటే నమ్మండి. 1985 నుంచి సావిత్రమ్మ దోశలు వేస్తూ జీవనం సాగిస్తోంది. అప్పట్లో పావలాకు ఒక దోశ ఇచ్చేది అనుకోండి. కానీ, ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కదా! అందుకే తప్పని పరిస్థితులలో దోశ ధర కూడా పెంచక తప్పలేదు.
నిత్యావసర సరకుల ధరలు రాకెట్లాగా ఆకాశం వైపు దూసుకుపోతున్నా.. అవ్వ దోశ రూపాయి వద్ద స్థిరంగా నిలబడి పోయింది. దోశ వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే తన ముగ్గురు పిల్లలను పెంచి పోషించింది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది. కుమారుణ్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడ్ని చేసింది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా దోశలు వేస్తూ కష్టపడి సంపాదించే రూపాయి వెనుక ఉండే ఆనందాన్ని పొందుతుంది. అటు వైపు వెళ్లే విద్యార్థులు, దిన కూలీలు అవ్వ దోశలు ఎగబడి తింటారు. ఇద్దరు ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు రెగ్యులర్ కస్టమర్లు కూడా.
తమ అనుచరులతో వచ్చి దోశలు ఆరగించకపోతే రోజే గడవదు అన్నట్టు ఉంటుందంట వారి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది.. సావిత్రమ్మ దోశల గిరాకీ ఏంటో.. హోటల్‌లో మసాలా దోశ రూ.50, ఇంక పన్నీరుదోశ, ఉల్లి దోశల ధరల గురించి చెప్పనక్కర్లేదు. వీటితో పోల్చుకుంటూ సావిత్రమ్మ వద్ద ఓ పది పదిహేను దోశలు లాగించి కడుపు నింపుకుని, సంతృప్తిగా త్రేన్చుకుంటూ పోతే సరి.. అనుకుంటున్నారు కస్టమర్లు. దీంతో మూడు దోశలు ఆరు త్రేన్పులుగా సాగుతోంది అవ్వ దోశల వ్యాపారం.
Also Read: Dead Body in Water Tank: తాగే నీళ్ల ట్యాంకులో నెల రోజులుగా కుళ్లిన శవం.. ఆ నీటినే తాగుతున్న జనం
Also Read: TSRTC: రేపటి నుంచి ప్రతి గురువారం టీఎస్ఆర్టీసీ ‘బస్ డే’.. ఆ రోజు అందరూ ఏం చేస్తారంటే..
Also Read: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి?