Minister Atchennaidu: అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అసెంబ్లీ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన
Andhra News: ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్షాలు లేక పంటలు కోల్పోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
Minister Atchennaidu Relief Fund To Farmers: ఏపీలో అన్నదాతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు అసెంబ్లీ (AP Assembly) సాక్షిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. వర్షాభావ పరిస్థితులతో పంటను కోల్పోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందించనున్నట్లు తెలిపారు. వర్షాలు లేక పలు జిల్లాల్లో 1.06 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పిన ఆయన.. ఇప్పటికే 54 కరవు మండలాలను ప్రకటించామని చెప్పారు. మొత్తం 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని.. వారికి పరిహారంగా రూ.159.2 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని అన్నారు. అలాగే, నష్టపోయిన రైతులకు రాయితీతో 47 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. జీడి మామిడికి సంబంధించి మద్దతు ధరపైనా మంత్రి ప్రస్తావించారు.
ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగింది. అక్టోబర్ 29న 54 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాం. అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరవు ఉంది. 1.06 లక్షల హెక్టార్ల పంట, 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా… pic.twitter.com/YbUWXoscB9
— Telugu Desam Party (@JaiTDP) November 15, 2024
'శ్రీకాకుళంలో జీడి మామిడి బోర్డు'
జీడి మామిడికి మద్దతు ధర ప్రకటించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 'ఇప్పటికే ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాశాం. జీడిమామిడి పండుకు బైప్రొడక్టుగా చాలా ఆదాయం రావొచ్చు. రాష్ట్రంలో జీడిమామిడి బోర్డు ఏర్పాటుపై కూడా సీఎం, కేంద్ర మంత్రితో చర్చించాం. శ్రీకాకుళంలో జీడిమామిడి బోర్డు పెడతామని వారు హామీ ఇచ్చారు.' అని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో కొబ్బరి చెట్ల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని.. కానీ తమ ప్రభుత్వం కొత్త చెట్లు అందజేయబోతోందని ప్రకటించారు. ఉద్దానంలో ఒక కోకోనట్ పార్క్ కావాలని అడిగారని.. ఆ అంశాన్ని సైతం ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని తెలిపారు.
కాగా, ఇటీవలే శాసనసభలో మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తున్నామని.. ఇందు కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పారు. రైతులకు విత్తనాలు, సూక్ష్మ ఎరువులు రాయితీపై అందిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్‌లో విపత్తుల సమయంలో పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచింది. గతంలో హెక్టారుకు రూ.17 వేలు పంట నష్టం కింద పెట్టుబడి సాయంగా అందించేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25 వేలకు పెంచారు. ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు, రాష్ట్రంలోని 21 జిల్లాల్లో పంట నష్టపోయిన 1.90 లక్షల మంది రైతులకు.. ఈ - క్రాప్ ద్వారా రూ.284.56 కోట్లు జమ చేశారు.
Also Read: AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్