Pawan Kalyan : కోనసీమ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా జరిగినవే, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తా- పవన్ కల్యాణ్
Pawan Kalyan On Amalapuram Issue : కోనసీమ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా జరిగాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమకు సీఎం, మంత్రులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
Pawan Kalyan On Amalapuram Issue : అమలాపురం అల్లర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. కోనసీమ గొడవలు ఉద్దేశపూర్వకంగా జరిగినవే అని పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమకు ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కోనసీమ తగలబడుతుంటే మంత్రులు బస్సు యాత్ర చేస్తారా అని నిలదీశారు. అమలాపురం అల్లర్లలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబడుతుంటుంటే అగ్నిమాపక యంత్రాలు ఎందుకు రాలేదని పవన్ ప్రశ్నించారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలనే ఆలోచన ఉంటే ముందే చేసేవారన్నారు. జిల్లాల విభజనలో విరుద్ధమైన విధానంలో ప్రభుత్వం ఉందన్నారు. అల్లర్లపై నిఘా విభాగానికి సమాచారం ఎందుకు లేదని నిలదీశారు. అమలాపురం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానన్నారు.
ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదు
మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఘటనలో మంత్రి విశ్వరూప్ కూడా బాధితులే అన్నారు. కోనసీమ ఘటన జరిగి ఇన్నాళ్లైనా ప్రభుత్వం స్పందించకపోవడపై అనుమానాలు కలిగిస్తోందన్నారు. తనకు తెలిసినంత వరకు మంత్రి విశ్వరూప్ మంచి వ్యక్తి అని పవన్ వ్యాఖ్యానించారు. మంత్రి విశ్వరూప్ రాజకీయాల కోసం రెచ్చగొట్టే వ్యక్తి కాదన్నారు. వైసీపీ ఉన్నంతవరకు పోలవరం పూర్తి కాదన్నారు. కొట్టడం తమ హక్కుగా వైసీపీ భావిస్తోందని ఆరోపించారు. కోనసీమలో ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత పర్యటిస్తానని పవన్ అన్నారు. బీజేపీతో సంబంధాలపై పవన్ భిన్నంగా స్పందించారు. తనకు దిల్లీ బీజేపీ నేతలతోనే సంబంధమని, ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదన్నారు. మహానాడు సక్సెస్ అయితే మంచిదే అన్నారు. వైసీపీ పాలన బాగుంటే పొత్తుల ప్రస్తావన ఎందుకు వస్తుందన్నారు. కొన్ని కులాల వారిని వైసీపీ ప్రభుత్వం శత్రువులుగా భావిస్తోందన్నారు. కమ్మ, కాపు, బీసీ, మత్స్యకార కులాలను వైసీపీ శత్రువులుగా చూస్తుందని ఆరోపించారు.
బీజేపీ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ నేతలతో సంబంధం పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దిల్లీ బీజేపీ నేతలతో సంబంధమని ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదని పవన్ అన్నారు. ఏపీ బీజేపీ నేతలకు ఆయన పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వారి నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చెప్పినట్టు అర్థం వచ్చే విధంగా పవన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. పవన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.