CM Jagan Review on Mandous : తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
CM Jagan Review on Mandous : ఏపీపై మాండూస్ తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల అధికారులను అలెర్ట్ చేశారు.
CM Jagan Review on Mandous : మాండూస్ తుపాను ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులపై ఆరా తీసిన సీఎం...వివిధ జిల్లాల్లో తుపాను ప్రభావంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరిచి.. ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉండాలని ఆదేశించారు.
తీరందాటిన తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండూస్ శుక్రవారం అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటినట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయానికే తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది వాయవ్య దిశగా పయనించి శనివారం (డిసెంబరు 10) మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు తెలిపారు. తుపాను ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలుచోట్ల పది మీటర్ల నుంచి 20 మీటర్ల దూరం మేర సముద్రం ముందుకు వచ్చింది. ఏపీలో వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. చలిగాలులు ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. తీరం వెంట 65 నుంచి 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా.. కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో 125.75, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 114 మి.మీ వర్షపాతం నమోదైంది.
తిరుమలపై మాండూస్ ప్రభావం
మాండూస్ తుపాను ప్రభావం తిరుమలపై పడింది. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అంతే కాకుండా తిరుమలకు వచ్చే భక్తులకు ఒకవైపు వర్షం, మరోవైపు చలి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు, స్వామి వారి దర్శనంతరం ఆలయం బయటకు వచ్చే భక్తులు లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం, అన్నప్రసాదం కేంద్రానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారు. ఇక దర్శనంతరం వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు వసతి గృహాలకు వెళ్లలేక షెడ్స్ వద్ద తల దాచుకుంటున్నారు. రెండు రోజులుగా రేయింబవళ్ళు తేడా లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లడ్డూ వితరణ కేంద్రంలో వర్షపు నీరు నిలిచి పోవడంతో పారిశుద్ధ్య కార్మికులు వర్షపు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమలలోని దర్శనీయ ప్రదేశాలైన పాపవినాశనం, వేణుగోపాల్ స్వామి ఆలయం, ఆకాశ గంగ, జాపాలి, శ్రీవారి పాదాలు, వంటి ప్రదేశాలకు భక్తుల అనుమతిని టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉండడంతో ద్విచక్ర వాహనాలను అనుమతిని రద్దు చేశారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ద్విచక్ర వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కొండకు అనుమతించడం లేదు.
విరిగిపడిన భారీ వృక్షం
తిరుమలలో రెండు రోజులుగా మాండూస్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు వృక్షం నేలకొరిగింది. తిరుమలలోని బాలాజీ బస్టాండ్ కు ఆనుకొని ఉన్న ఏఎన్సీ కాటేజెస్ వద్ద ఒక్కసారిగా భారీ వృక్షం కుప్పకూలింది. ఆ దారిలో వెళ్తోన్న పారిశుద్ధ్య కార్మికురాలిపై చెట్టు పడింది. దీన్ని గుర్తించిన పారిశుద్ధ్య కార్మికురాలు తప్పించుకొనే ప్రయత్నం చేసింది. అయినా ఆమెపై చెట్టు పడిపోవడంతో స్వల్ప గాయాల పాలైంది. అక్కడకు చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికురాలిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది కటింగ్ యంత్రాల ద్వారా విరిగిపడిన చెట్టును తొలగించారు.