Layout Regularisation Scheme: ఏపీలో అక్రమ లేఔట్లలో ప్లాట్లు కొన్న వారికి గుడ్‌న్యూస్, LRSతో రెగ్యులరైజేషన్‌కు ఛాన్స్
LRS In Andhra Pradesh | పర్మిషన్ లేని లేఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బంది పడుతున్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్లాట్ల క్రమబద్ధీకరణకు లేఔట్ రెగ్యూలరైజేషన్ స్కీమ్ (LRS) అమలు చేస్తుంది.

అమరావతి: తెలంగాణలో అమలులో ఉన్న లే ఔట్ రెగ్యూలరైజేషన్ స్కీమ్ (LRS)ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్ కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఇక నుంచి ఆ ప్రాపర్టీలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్లు రెగ్యూలరైజ్ చేసుకుంటే ఆ ప్రాపర్టీ యజమానులకు ఏ సమస్యా ఉండదు. అవసరమైతే వాటిని ఏ సమస్యా లేకుండా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది జూన్ వరకు పర్మిషన్ లేని లేఔట్లలో ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎల్‌ఆర్ఎస్ పథకానికి అర్హులు అని ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులు.
ఎవరు అర్హులు?
- 2025 జూన్ 30 లోపు ఏపీలో అనుమతులు లేని లే ఔట్లలో ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు LRSకు అర్హులు.
- ఈ అక్టోబరు నెలాఖరు వరకు దరఖాస్తులు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో దరఖాస్తు
– సమీపంలో ఉన్న లైసెన్సుతో ఉన్న టెక్నికల్ పర్సన్ (LTP) ద్వారా లేదా
– మీరే సొంతంగా LRS పోర్టల్‌లో దరఖాస్తు చేయవచ్చు.
– అవసరమైన పత్రాలు: రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, లేఔట్ కాపీ మొదలైనవి అప్‌లోడ్ చేయాలి.
ఫీజు చెల్లింపు, డిస్కౌంట్
– కనీస మొత్తం ₹10,000 చెల్లించాలి.
– మొత్తం ఫీజును 45 రోజుల్లో చెల్లిస్తే 10% డిస్కౌంట్ లభిస్తుంది.
– 45 నుంచి 90 రోజుల్లో చెల్లిస్తే 5% మాత్రమే రాయితీ.
– అదనంగా 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలో 7% రాయితీ వర్తిస్తుంది.
LRS దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ:
– మున్సిపల్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని పరిశీలించి తాత్కాలిక లేఔట్ నమూనా తయారు చేస్తారు.
– కనీసం 30 అడుగుల రోడ్లు ఉండేలా లేఔట్ డిజైన్ చేస్తారు.
– అభ్యంతరాలతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు.
– అభ్యంతరాలేని ప్లాట్లకు మిగిలిన ఫీజు వసూలు చేసి వాటిని వెంటనే క్రమబద్ధీకరిస్తారు.
సీఆర్‌డీఏ పరిధిలో వర్తించదు
రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు లేకుండా 13,667 లేఔట్లు ఏర్పాటయ్యాయని కూటమి ప్రభుత్వం అంచనా చేసింది. సీఆర్‌డీఏ పరిధిలోని 29 గ్రామాలకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తించదు. లేఔట్ ప్లాన్ (LP) నంబర్ చెప్పి అనుమతుల వివరాలు సమీప టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ 79816 51881 లో సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
LRSతో కలిగే ప్రయోజనాలు:
- ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు పొందొచ్చు.
- హౌసింగ్ లోన్లకు బ్యాంకులు అంగీకరిస్తాయి.
- ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలపై 14 శాతం డిస్కౌంట్లు లభిస్తాయి.
- లే ఔట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధ్యం.
తెలంగాణలో ఎల్‌ఆర్ఎస్‌కు విశేష స్పందన..
తెలంగాణలో 2020లో ఈ స్కీమ్ తీసుకురాగా, పర్మిషన్ లేని లేఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడుతున్న వారి నుంచి మంచి స్పందన లభించింది. రాయితీ ఇస్తామని చెప్పడంతో తెలంగాణలో లక్షల మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో లేఔట్లకు పర్మిషన్ రాగా, కొన్ని చోట్ల ఇంకా రిజిస్ట్రేషన్ సమస్యలు, లేఔట్ల క్రమబద్ధీకరణ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై చర్యలు తీసుకుని వాటిని క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కానీ కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే పరిష్కారం లభించగా.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిసిందే.






















